'జగన్మోహిని' పాటలు
రాజా, మీరాచోప్రా, నమిత ప్రధాన పాత్రల్లో మురళి సినీ ఆర్ట్స్ పతాకంపై ఎస్.కె.విశ్వనాథన్ దర్శకత్వంలో హెచ్.మురళి నిర్మిస్తున్న చిత్రం 'జగన్మోహిని'. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుతోంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. డాక్టర్ డి.రామానాయుడు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని సి.కల్యాణ్ కు అందజేశారు. రాజా, మీరాచోప్రా, కోట, ఆలీ, నర్సింహరాజు, సురేష్, వెన్నెలకంటి, హెచ్.మురళి, ఎస్.కె.విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఆడియో మధుర మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
డి.రామానాయుడు మాట్లాడుతూ, సినిమా ట్రైలర్స్ చాలా బాగున్నాయనీ, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాత తనకు మంచి మిత్రుడనీ, మంచి క్వాలిటీ, చక్కటి గ్రాఫిక్స్ తో సినిమా తీశారనీ, యూనిట్ అందరికీ ఈ చిత్రం మంచి విజయం సాధించి పెడుతుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. నిర్మాత మురళి గతంలో తనతో తమిళంలో రెండు సినిమాలు తీశారనీ, రాజాతో చేసిన ఈ సినిమా అందరికీ మంచి సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నాననీ సురేష్ అన్నారు. నరసింహరాజు మాట్లాడుతూ, పాతికేళ్ల క్రితం తాను హీరోగా ఈ చిత్రం వచ్చిందనీ, ఇప్పుడు అదే టైటిల్ తో రాజా హీరోగా వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. చిన్నప్పుడు అమ్మతో కలిసి ఈ సినిమా చూశాననీ, ఇప్పుడు గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ చిత్రం మరింత మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాననీ ఆలీ అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రం తెరకెక్కినట్టు కోట శ్రీనివాసరావు తెలిపారు. రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ, ఆరోజుల్లో విఠలాచార్య దర్శకత్వంలో తెలుగులో రూపొందిన 'జగన్మోహిని' చిత్రం ఆ తర్వాత తమిళంలోకి అనువాదమైందనీ, అక్కడ 375 రోజులు ఆడిందనీ చెప్పారు. ఇప్పటి కథలో చాలా మార్పులు ఉన్నాయనీ, ఇళయరాజా మంచి సంగీతం అందించారనీ తెలిపారు. హీరో రాజా మాట్లాడుతూ, ఈ సినిమాకి మరెవరైనా నిర్మాత అయి ఉంటే మధ్యలోనే ఆగిపోయి ఉండేదనీ, ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం, ళయరాజా సంగీత దర్శకుడు కావడం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు. ఇందులో చాలా గ్రాఫిక్స్ ఉన్నాయనీ, సినిమాను మూడు ఐలాండ్స్ లో సెట్స్ వేసి తీశామనీ నిర్మాత మురళి తెలిపారు. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం తీసుకుందనీ, తెలుగు, తమళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|