'హైదరాబాద్ బిర్యానీ' మొదలు
ముగ్గురు యువకులు తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు హైదరాబాద్ కు వచ్చి ఏం చేశారనే ఇతివృత్తంతో 'హైదరాబాద్ బిర్యానీ' చిత్రం తెరకెక్కనుంది. విజయభాస్కర్, సుదీప్, పావని, సౌమ్య, రోషిణి హీరోహీరోయిన్లు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఫిలింస్ పతాకంపై మంచి వెంకటేష్, కొండపల్లి నందు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.శ్రీధర్ దర్శకుడు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సోమవారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై తీసిన ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు టి.ప్రశాంత్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు సూర్యకిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచం మొత్తం మీద ఎంతో పేరుందనీ, ఈ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా అంత కాకపోయినా మన ఆంధ్రప్రదేశ్ లో ప్రేక్షకుల మనసులను హత్తుకోవాలని కోరుకుంటున్నామని సూర్యకిరణ్, ఆర్.పి.పట్నాయక్ అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ, బిర్యానీలో ఎన్ని మసాలాలు ఉంటాయో తమ చిత్రంలో కూడా అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని చెప్పారు. పూర్తి వినోదంతో సినిమా ఉంటుందన్నారు. ముగ్గురు యువకులు తమ ఆశయ సాధనకు ఏం చేశారన్నదే ఈ చిత్ర కథాంశమని తెలిపారు. రెండు రోజుల పాటు షూటింగ్ జరిపి, సెప్టెంబర్ 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామనీ, అక్టోబర్ లో రెండో షెడ్యూల్ ఉంటుందనీ చెప్పారు. డిసెంబర్ లో సినిమా విడుదల చేస్తామని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు నిర్మాతల్లో ఒకరైన ఎం.వెంకటేష్ తెలిపారు. లవ్, కామెడీ, సెంటమెంట్ వంటి అంశాలన్నీ కథలో మిళితమై ఉంటాయని తెలిపారు. నటనకు అవకాశమున్న పాత్రలను ఇందులో పోషిస్తున్నట్టు హీరో హీరోయిన్లు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఎం.ఎస్.నారాయణ, కొండవలస, రామిరెడ్డి, గుండు హనుమంతరావు, గుండు సుదర్శన్, జెన్నీ, జూనియర్ రేలంగి, అపూర్వ, అక్షర తదితరులు నటిస్తున్నారు.
ధనుంజయ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, శివశంకర్ రెడ్డి సంగీతం అందిస్తున్నారు.

Be first to comment on this News / Article!
|