'గంగ'గా వెంకటేష్
ఫ్యామిలీ ఆడియెన్స్ లో విక్టరీ వెంకటేష్ కు చెక్కు చెదరని ఆదరణ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే టైటిల్స్ ఎంపిక చేసిన 'లక్ష్మీ', 'తులసి' చిత్రాలు చక్కటి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరోసారి మహిళలను ఆకట్టుకునే విధంగా వెంకటేష్ తదుపరి చిత్రానికి 'గంగ' అనే టైటిల్ అనుకుంటున్నారు. వెంకటేష్ తో 'లక్ష్మీ', 'చింతకాయల రవి' చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబుతో కలిసి నిర్మించబోతున్నారు. దర్శకుడిగా మారిన నృత్య దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ మాఫియా డాన్ పాత్రను పోషించనుండటం విశేషం. మరో పాత్రను కూడా వెంకటేష్ ఇందులో పోషించున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ హైద్రాబాద్ లో జరుగుతోంది.
హైద్రాబాద్ శివార్లులోని చిలుకూరి బాలాజీ ఆలయం సమీపంలో ఓ భారీ హౌస్ సెట్ ను ఈ చిత్రం కోసం నిర్మిస్తున్నారు. ప్రముఖ కళాదర్శకుడు తోట తరణి నేతృత్వంలో ఈ సెట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఇదే సెట్ లో చిత్రీకరిస్తారు. వెంకటేష్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'నమో వెంకటేశ' సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు. ఈవారంలోనే ఆయన హైద్రాబాద్ తిరిగి వస్తారనీ, వచ్చిన వెంటనే అమ్మ రాజశేఖర్ చిత్రం షూటింగ్ కు సంబంధించిన షెడ్యూల్స్ ఖరారవుతాయనీ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథానాయిక ఎంపిక జరుగుతోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు.
Be first to comment on this News / Article!
|