బాలీవుడ్ బాటలో మమత
శ్రియ, జెనీలియా, ఆసిన్ వంటి దక్షిణాది తారలు ఇప్పటికే బాలీవుడ్ లోనూ తమ సత్తా చాటుకుంటున్నారు. త్రిష సైతం ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ కు జోడిగా 'కట్టా మీఠా' చిత్రంతో బాలీవుడ్ గడప తొక్కనుంది. త్రిష బాటలోనే ఇప్పుడు మమతా మోహన్ దాస్ సైతం దక్షిణాది బోర్డర్ దాటి హిందీలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
మలయాళ కుట్టి మమతా మోహన్ దాస్ తెలుగులో కొద్దికాలంగా హీరోయిన్ గా, గాయనిగా తన టాలెంట్ ను చాటుకుంటోంది. 'యమదొంగ', 'చింతకాయల రవి' వంటి పలు చిత్రాల్లో మమత నటించింది. చివరిసారిగా నాగార్జున 'కింగ్'లో సెకెండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. నెగిటవ్ తరహా పాత్రను ఇందులో మమత పోషించింది. అయితే ఇందులో తన పాత్రను బాగా కుదించారంటూ మమత బహిరంగంగానే తన బాధను వ్యక్తం చేసింది. ఆ చిత్రం తర్వాత మమత మళ్లీ ఏ కొత్తచిత్రం కూడా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో మలయాళంలో వరుస చిత్రాలకు కమిట్ అయింది. పనిలో పనిగా బాలీవుడ్ ఎంట్రీకి కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇటీవలే ముంబై వెళ్లి ఫోటో సెషన్ లో కూడా పాల్గొంది. ఆసక్తికరంగా మమత ప్రొఫైల్ ప్రముఖ దర్శకుడు ఇంతిహాజ్ అలీకి బాగా నచ్చడంతో ఆమెకు తన తదుపరి చిత్రంలో హీరోయిన్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. 'జబ్ ఉయ్ మెట్', 'లవ్ ఆజ్ కల్' వంటి సంచలన హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు ఇంతియాజ్ అలీ మరో ప్రేమకథా చిత్రాన్ని రణ్ బీర్ కపూర్ తో ప్లాన్ చేస్తున్నారు. ఆయనకు జోడిగానే మమతను అనుకుంటున్నారు. మమత సైతం ఈమధ్య 'ఫ్లూ' బారిన పడి మలయాళంలో దిలీప్ తో ఒప్పుకున్న చిత్రం నుంచి డ్రాప్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగులోనూ కొత్త కమిట్ మెంట్లు లేని మమత తదుపరి జర్నీ బాలీవుడ్డే కావచ్చు...
Be first to comment on this News / Article!
|