'ఓ వర్షం కురిసిన రాత్రి'
రొమాంటిక్ లేడీ రివేంజ్ ఇతివృత్తంతో 'ఓ వర్షం కురిసిన రాత్రి' చిత్రం తెరకెక్కుతోంది. ముంబైకి చెందిన సారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఎన్.రమేష్ దర్శకత్వంలో జ్యోతి ఫిలింస్ ఫ్యాక్టరీ పతాకంపై శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈనెల 1వ తేదీన రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ జరుపుకొంటోంది. తొలిసారి ఆ విశేషాలను చిత్ర యూనిట్ హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో మంగళవారంనాడు తెలియజేసింది.
రెండు పాటలు, కొద్ది పాటి టాకీ మినహా షూటింగ్ పూర్తి చేసినట్టు దర్శకుడు రమేష్ తెలిపారు. వర్షం కురిసిన రాత్రి ఓ అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందనే ఇతివృత్తంతో ఈ చిత్రం ఉంటుందన్నారు. ప్రేక్షకులను అడుగడుగునా ఉత్కంఠకు గురి చేస్తుందని తెలిపారు. ఇందులో ముంబై నటి సారా కథానాయికగా నటిస్తోందని చెప్పారు. మొత్తం నాలుగు పాటలు ఉన్నాయనీ, వీటికి ఎస్.ఎ.రాజ్ కుమార్ శిష్యుడు నరేష్ వీనులవిందైన సంగీతాన్ని అందించారని అన్నారు. ఎన్టీఆర్-బి.సరోజాదేవి నటించిన 'దాగుడుమూతలు' చిత్రంలోని 'మెల్లమెల్ల మెల్లగా అణువణువూ నీదెగా' పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నట్టు తెలిపారు. నిర్మాత శంకర్ మాట్లాడుతూ, ఈ చిత్రం చాలా బాగా వస్తోందనీ, మిగతా షూటింగ్ ను కూడా వెంటనే పూర్తి చేస్తామనీ చెప్పారు. అక్టోబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. పాత్రలకు తగ్గ నటీనటులతో ఎక్కడా రాజీ పడకుండా సినిమా రూపొందుతోందని చిత్ర నిర్వాహకుడు ప్రేమ్ కుమార్ తెలిపారు. తన పాత్రను విభిన్నంగా తీర్చిదిద్దుతున్నట్టు హీరోల్లో ఒకరైన వేణుకృష్ణ తెలిపారు. వైభవ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వహీదా, సుమన్ శెట్టి, షకీలా, గుండు హనుమంతరావు, హర్షిణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కథ-మాటలు-స్రీన్ ప్లే సైతం ఎన్.రమేష్ అందిస్తున్న ఈ చిత్రానికి గుమ్మళ్ల రామారావు-రోహిత్ పాటలు, విద్యానంద్ సినిమాటోగ్రఫీ, బాబు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|