రామ్ చరణ్ కొత్త గెటప్
'చిరుత', 'మగధీర' చిత్రాల్లో యాక్షన్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ తదుపరి చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకాభిమానుల్లో నెలకొంది. తెలుగు సినిమా కలెక్షన్ రికార్డులను 'మగధీర' చిత్రం తిరగరాస్తుండటంతో సహజంగానే చరణ్ మూడో చిత్రంపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా రామ్ చరణ్ సైతం తన మూడో చిత్రం విషయంలో పూర్తి వైవిధ్యమైన గెటప్ లో, వైవిధ్యమైన పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇటీవల 'సంతోషం' అవార్డుల ఫంక్షన్ లో రామ్ చరణ్ మీసం తీసేసి క్లీన్ షేవింగ్ తో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన తదుపరి చిత్రంలో ఇదే గెటప్ తో కనిపించబోతున్నారని విశ్వసనీయ సినీ వర్గాల భోగట్టా. 'బొమ్మరిల్లు', 'పరుగు' వంటి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలను అందించిన భాస్కర్ దర్శకత్వంలో చరణ్ తదుపరి చిత్రం ఉండబోతోంది. ఇందుకు సంబంధించి కొద్దికాలంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా చురుకుగా జరుగుతున్నాయి. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
రామ్ చరణ్ తన వయసుకు తగ్గ పాత్రను ఇందులో పోషించబోతున్నారనీ, ప్లేబాయ్ తరహాలో ఆయన పాత్ర ఉండబోతోందనీ తెలుస్తోంది. ఈ పాత్ర కోసం స్కై డైవింగ్ లో కూడా రామ్ చరణ్ శిక్షణ పొందుతున్నారు. ఆయనకు జోడిగా జెనీలియా నటించనుంది. అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమెరికాలో ఉంటున్న ఔత్సాహిక ఎన్ఆర్ఐ నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|