లేడీ విలన్ గా రోజా
సినీ గ్లామర్ తెచ్చిపెట్టిన పేరు రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుంటుంది. ఎందుకంటే సినీ గ్లామర్ కూ, రాజకీయాలకు ఎప్పట్నించో విడదీయరాని బంధం ఉంది. సినీరంగంలో పోటీ ఉన్నా ఎవరి అవకాశాలు వారికి ఉండనే ఉంటాయి. రాజకీయాల్లో మాత్రం చాలామటుకు నోరుతో నెగ్గుకు రావాలి. ఇందువల్ల శత్రువులు పెరుగుతుంటారు. తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించిన రోజా ఇటీవల అసెంబ్లీ ఫలితాల్లో ఎదురైన చేదు అనుభవంతో మరోసారి జిలుగు వెలుగుల కెమెరా ముందు మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు హోదాలో ఉన్న రోజా ఇటీవల చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమిని రోజా ఇప్పటికీ జీర్ణించుకోలేకున్నారు. మళ్లీ ఎలెక్షన్లకు చాలాకాలం ఉండటంతో ఇప్పుడు సినిమాల్లో మరో ఇన్నింగ్స్ కు రోజా రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే తమిళంలో విజయవంతమైన 'నానోడిగల్' తెలుగు రీమేక్ లో రోజా ఈ కీలక పాత్రను పోషించబోతున్నారు.
రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, సునీల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్ దర్శకుడు సుముతిరకని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు కూడా పరిచయమవుతున్నారు. తమిళంలో శాంతిని దేవి పోషించిన లేడీ విలన్ ప్రభ పాత్రలో రోజా నటించబోతున్నట్టు సమాచారం. రోజా ఆహార్యం, వాయిస్ ఈ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు సరిగ్గా సరిపోతాయని అనుకోవచ్చు. రోజా విలనీ క్లిక్ అయితే మరిన్న ప్రతినాయకురాలు పాత్రలు ఆమెను వరించడం ఖాయం.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|