యువసామ్రాట్ నాగార్జున 'కింగ్' తర్వాత ఆర్నెళ్లకు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న కొత్త చిత్రం జూలై 24న పూజా కార్యక్రమాలు జరుపుకొని ఇప్పుడు రెగ్యులర్ షెడ్యూల్ లోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రం ద్వారా కిరణ్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ గోవాలా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో నెలరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో నాగార్జున పాల్గొంటారు.
ఈ చిత్రం స్టోరీలైన్ ఏమిటనేది ఇంకా బయటకు రానప్పటికీ కార్డ్ గేమ్ (గాంబ్లింగ్) చుట్టూ అల్లుకున్న కథ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే నాగార్జున పేకముక్కలు పట్టుకున్న ఫోటో లు రిలీజ్ చేశారు. గోవా బీచ్ సమీపంలో చట్టబద్ధమైన కాసినో కూడా ఉండటంతో అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నాగార్జునకు జోడిగా బాలీవుడ్ నటి చిత్రాంగధ సింగ్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. 'నేను దేవుడ్ని' చిత్రంలో అంధురాలి పాత్రలో నటించిన పూజ మరో కథానాయికగా నటించనుంది. సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. నాగార్జునకు ఉన్న డిసెంబర్ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని అదే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత శివప్రసాద్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.