దిల్ రాజు చేతికి 'గణేష్'
నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న దిల్ రాజు ఇటీవలే విక్రమ్ 'మల్లన్న' చిత్రం నైజాం ఏరియా రైట్స్ ను దక్కించుకున్నారు. తాజాగా రామ్ కథానాయకుడుగా స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్న గణేష్ (జస్ట్ గణేష్) చిత్రం నైజాం ఏరియా రైట్స్ ను ఆయన సొంతం చేసుకున్నారు. 'రెడీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత స్రవంతి బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడం, 'మగధీర' వంటి సంచలన హిట్ తర్వాత కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే 4.5 కోట్ల రూపాయల భారీ ఆఫర్ తో నైజాం ఏరియా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. గుంటూరు, కృష్ణా ఏరియాల్లో స్రవంతి రవికిషోర్ సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ రైట్స్ ను క్యాడ్ ఎంటట్ టైన్ మెంట్స్ దక్కించుకుంది.
పిల్లల నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా 'గణేష్'ను దర్శకుడు డి.శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలోని క్లైమాక్స్ లో వచ్చే 'లంబోదర అంబాసుత' అనే పాటను సారథి స్టూడియోస్ లో రిచ్ గా చిత్రీకరించారు. 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' వంటి మ్యూజికల్ హిట్స్ అందించిన మిక్కీ జె. మేయర్ సంగీతం, 'మగధీర' చిత్రాన్ని యాక్షన్ ఘట్టాలు అందించిన పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయి. అబ్బూరి రవి మాటలు, హరి అనుమోలు సినిమాటోగ్రఫీ, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 23 లేదా 24న ఈ చిత్రం విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|