'మల్లన్న'కు మంచి ఆదరణ
'అపరిచితుడు' చిత్రం తర్వాత మరోసారి ఇటు పెద్దలను, అటు పిల్లల్ని 'మల్లన్న' చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోందని ఆ చిత్ర కథానాయకుడు విక్రమ్ తలిపారు. విక్రమ్, శ్రియ జంటగా సుశీ గణేషన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైద్రాబాద్ లోని ఫైవ్ స్టార్ హోటల్ లో గురువారం నిర్వహించారు. విక్రమ్, శ్రియ, సుశీ గణేషన్, కలైపులి థాను, రచయిత సాహితి పాల్గొన్నారు.
నల్లధనం కారణంగా దేశాభివృద్ధి ఎలా కుంటుపడుతుందో ఈ చిత్రంలో ఆవిష్కరించామనీ, అన్ని కమర్షియల్ హంగులూ ఈ చిత్రంలో ఉన్నాయనీ విక్రమ్ చెప్పారు. ఇందులోని ఆడవేషం కోసం తాను చాలా కష్టపడ్డాననీ, చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్ ఆ పాత్రలో మరింత బాగా నటించేందుకు దోహదం చేసిందనీ చెప్పారు. శ్రియ తన పాత్రలో ఎంతో బాగా నటించిందని ప్రశంసించారు. తమిళంలో 'కందసామి' పేరుతో విడుదలైన ఈ చిత్రం ఒక్క చెన్నై నగరంలోనే 18 థియేటర్లలో విడుదలైందన్నారు. హైద్రాబాద్ లోని థియేటర్ కు బుధవారంనాడు తాను వెళ్లి ప్రేక్షకులను నేరుగా కలిశాననీ, వారి నుంచి మంచి స్పందన వచ్చిందనీ పేర్కొన్నారు. దర్శకుడు సుశీ గణేషన్ మాట్లాడుతూ, నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువస్తే అదే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజని ఇందులో చెప్పామనీ, సినిమా ఇంత బాగా రావడానికి విక్రమ్ తో పాటు నిర్మాత థాను కారణమనీ అన్నారు. విక్రమ్ మంచి నటుడనీ, ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందనీ శ్రియ పేర్కొంది. కలైపులి థాను మాట్లాడుతూ, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రెండేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రం తీశామనీ, ఆదరిస్తున్న ప్రేక్షకులకు తన కృతజ్ఞతలనీ అన్నారు. గీత రచయితనైన తాను తొలిసారిగా ఈ చిత్రం ద్వారా మాటల రచయితగా పరిచయమయ్యాననీ, పాటలన్నింటినీ రాసే అవకాశం తనకు గలిగిందనీ రచయిత సాహితి తెలిపారు. ఇందులో దేవీశ్రీప్రసాద్ టైటిల్ సాంగ్ పాడగా, మిగిలిన పాటలన్నీ విక్రమ్ స్వయంగా పాడటం విశేషమని అన్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Be first to comment on this News / Article!
|