ముగ్ధం సింగ్ గా శ్రీహరి
కామెడీ విలన్ పాత్రలతో కెరీర్ ప్రారంభించి హీరోగా పలు సక్సెస్ లు సాధించిన రియల్ స్టార్ శ్రీహరి. ఒకవైపు హీరో పాత్రలు పోషిస్తూనే 'నవ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో సపోర్టింగ్ రోల్స్ కు శ్రీకారం చుట్టారు. 'రెఢీ', 'కింగ్' వంటి పలు చిత్రాల్లో ఆయన పోషించిన సపోర్టింగ్ రోల్స్ ఆయా చిత్రాల విజయంలో కీలక భూమిక పోషించాయి. శ్రీహరి 'సపోర్ట్' చేస్తే ఆ సినిమాలు పెద్ద సక్సెస్ సాధిస్తాయనే సెంటిమెంట్ ఇవాల్టి యువతరం హీరోలందరిలోనూ ఉంది. తాజాగా రామ్ చరణ్ 'మగధీర' చిత్రం సాధించిన సక్సెస్ తో ఆ సెంటిమెంట్ మరింత బలపడింది. అందులో శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్రలో మరొకరిని ఊహించడం కూడా కష్టం. అంత ప్రతిభావంతంగా శ్రీహరి ఆ పాత్రను పోషించి అందరి మొప్పును పొందారు. ఇప్పుడు ఆ సినిమా తమిళ రీమేక్ లో శ్రీహరి పాత్రను పోషించేందుకు ప్రభు, శరత్ కుమార్, సత్యరాజ్ వంటి పేరున్న నటులు పోటీపడుతున్నారు. శ్రీహరి సైతం తన కెరీర్ లో 'షేర్ ఖాన్' పాత్రకు వచ్చిన గుర్తింపు ఎప్పటికీ మరచిపోలేనని చెబుతున్నారు. ఆ పాత్రకు వచ్చిన ప్రశంసలను ఆయన ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఊపులో చారిత్రక నేపథ్యంలో ఓ పూర్తి స్థాయి క్యారెక్టర్ ను చేసేందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టినట్టు సమాచారం.
నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా శ్రీహరి దేశభక్తి నేపథ్యంలో తీసిన 'హనుమంతు' చిత్రం అప్పట్లో ప్రశంసలు అందుకుంది. మరోసారి తానే హీరోగా నటిస్తూ స్వాతంత్ర్య పోరాట యోధుడు 'ముగ్దం సింగ్' పాత్రను పోషించాలని శ్రీహరి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. జనరల్ డయ్యర్ నేతృత్వంలో జరిగిన 'జలియన్ వాలాబాగ్' దురంతంలో బతికి బయటపడిన పోరాట యోధుడే ముగ్ధం సింగ్. ఈ కథాంశంతో శ్రీహరి ఓ స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారని తెలుస్తోంది. 'హనుమంతు' చిత్రానికి జాతీయ అవార్డు ఆశించిన శ్రీహరి ఈసారి ఆ వార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|