ప్రకాష్ రాజ్ పై భరణం పిటిషన్
విలక్షణ నటుడుగా పేరున్న ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితంలో మాత్రం విడాకుల సమస్యతో సతమతమవుతున్నారు. తాజాగా తనకు నెలనెలా 2 లక్షల రూపాయలు భరణం ఉప్పించాలని కోరుతూ ఆయన భార్య లలితా కుమారి చెన్నైలోని ఎగ్మూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె శుక్రవారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.
ప్రకాష్ రాజ్, లలితాకుమారి సుమారు పదిహేనేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒక మగపిల్లవాడు చిన్నప్పుడే కన్నుమూశాడు. కొద్దికాలంగా ఈ దంపతుల వైవాహిక బంధం చిక్కుల్లో పడింది. ప్రకాష్ రాజ్ విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. లలితా కుమారి మాత్రం విడాకులకు ససేమిరా అంటూ వచ్చారు. ఇద్దరు కుమార్తెలనూ తన వద్దే ఉంచుకుంటోంది. ఈ క్రమంలో తన కుమార్తెల చదువు, పోషణ కోసం నెలకు 2 లక్షలు అవుతుందనీ, ప్రకాష్ రాజ్ తో భరణంగా నెలనెలా సొమ్ము ఇప్పించాల్సిందిగా ఆదేశించాలని ఆమె కోర్టుకు విన్నవించారు. ఇంతవరకు విడాకులకు ఇష్టపడని లలితా కుమారి ఇప్పుడు భరణం కోరడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్టయింది. ప్రకాష్ రాజ్ చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే ప్రజారాజ్యం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణిని పెళ్లి చేసుకున్నారంటూ ఇటీవల వదంతులు వెల్లువెత్తాయి. ఇందులో నిజం లేదంటూ వారిరివురూ వివరణ ఇచ్చారు. అయితే ఈ పరిణామం తర్వాతే ప్రకాష్ రాజ్ నుంచి భరణం రాబట్టాలనే ఆలోచన లలితా కుమారికి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లలితా కుమారి సోదరి అయిన శాంతి శ్రీహరి సైతం ఇటీవల ప్రకాష్ రాజ్ వైఖరిపై ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్పుపట్టారని సమాచారం. తన సోదరి కుటుంబానికి రోజువారి ఖర్చులకు కూడా ఎలాంటి డబ్బు ఇవ్వడం లేదనీ, ఫ్యామిలీ ఫంక్షన్లను కూడా పట్టించుకోవడం లేదనీ, ఈమధ్యనే ఆయన కుమార్తె పెద్దమనిషి అయినప్పటికీ ఆయన హాజరుకాలేదనీ శాంతి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ ను క్లోజ్ గా అబ్జర్స్ చేసిన వారు మాత్రం ఆయనకు కూతుళ్లంటే తగని ప్రేమనీ, వారిని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదనీ చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ నుంచి భరణం కోరుతూ లలితా కుమారి దాఖలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 4న విచారణ జరుగనుంది.
Be first to comment on this News / Article!
|