పోసాని 'తింగరోడు' షురూ
తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన సీనియర్ డైరెక్టర్ కె.వాసు మరో కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పోసాని కృష్ణమురళి కథానాయకుడుగా 'తింగరోడు' పేరుతో ఈ కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. ఫిలిం నగర్ సమీపంలోని దేవాలయంలో పోసాని, కథానాయిక శ్రద్ధఆర్య దేవుడికి నమస్కరించడాన్ని ముహూర్తం సన్నివేశంగా కె.వాసు చిత్రీకరించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడుగా కొత్తగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి దర్శకుడు వాసుకు అభినందనలు తెలియజేశారు.
వాసు మాట్లాడుతూ, ఈ కథను సిద్ధం చేసుకున్న తర్వాత పోసాని కృష్ణమురళి నటిస్తే బాగుంటుందని ఆయనను సంప్రదించామనీ, కథ విన్న వెంటనే నటించేందుకు అంగీకరించారనీ చెప్పారు. ఇందులో పోసాని సెక్యులర్ తరహా పాత్ర పోషిస్తున్నారనీ, అందుకే దీనికి 'తింగరోడు' అనే నామకరణం జరిగిందనీ తెలిపారు. హైద్రాబాద్ పరిసరాల్లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ జరిపి, కథకు అవసరమైన కొన్ని సన్నివేశాలను గోవా, ముంబై, కలకత్తాలో తీస్తామని చెప్పారు. పోసాని మాట్లాడుతూ, కథానుగుణంగా 'తింగరోడు' అనే పేరు కరెక్ట్ గా సరిపోతుందనీ, ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన వాసు దర్శకత్వంలో తొలిసారి నటిస్తుండటం సంతోషంగా ఉందనీ ఆన్నారు. పోసాని కృష్ణమురళి సరసన నటిస్తుండటం ఆనందంగా ఉందనీ, ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు వాసుకు కృతజ్ఞతలని శ్రద్ధా ఆర్య పేర్కొంది. పలువురు ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటించనున్నారు. ఎర్రంశెట్టి సాయి కథ, దాసరి బ్రహ్మం మాటలు, అంజి సినిమాటోగ్రఫీ, కె.రవీంద్రబాబు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|