శిష్యుడి సినిమాలో గురువు
పద్మశ్రీ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ లను పరిశ్రమకు అందించిన క్రెడిట్ ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ కే దక్కుతుంది. 'మరోచరిత్ర'తో కమల్ ను తెలుగుకు పరిచయం చేసిన ఘనత కూడా బాలచందర్ కే దక్కుతుంది. కెరీర్ తొలినాళ్లలో కమల్-రజనీని కలుపుతూ 'అంతులేని కథ', 'అందమైన అనుభవం' వంటి చిత్రాలను బాలచందర్ తీశారు. తమ కెరీర్ ను తీర్చిదిద్దిన గురువు పట్ల ఈ ఇద్దరు స్టార్ హీరోలకూ ఎంతో గౌరవం. కవితాలయ బ్యానర్ పై బాలచందర్ తమిళంలో పలు చిత్రాలు నిర్మిస్తూ వస్తున్నారు. గురువుగారికి ఓ సినిమా చేసి పెట్టాలనే ఆలోచనతో రజనీకాంత్ ఇటీవల 'కథానాయకుడు' చిత్రంలో నటించారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ కు బాలచందర్ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా కమల్ హాసన్ సైతం తన గురువు పట్ల ప్రత్యేక అభిమానం చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి గురుశిష్యుల పాత్రలు రివర్స్ కాబోతుండమే విశేషం. బాలచందర్ ను కమల్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని కమల్ ధ్రువీకరించారు.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై తన తదుపరి చిత్రం ఉంటుందనీ, ఇందులో బాలచందర్ ఓ కీలక పాత్ర పోషించనున్నారనీ కమల్ తెలిపారు. ఆయనతో కలిసి నటించడం ఇదే ప్రథమమనీ, ఈ చిత్రానికి స్వయంగా తాను దర్శకత్వం వహిస్తాననీ పేర్కొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఉండబోతోంది. కమల్ కథానాయకుడుగా నటిస్తూ నిర్మించిన 'ఈనాడు' చిత్రం సైతం ఈనెల 18న విడుదలకు సిద్ధమవుతోంది.
Be first to comment on this News / Article!
|