నాగార్జునతో దిల్ రాజు చిత్రం
దిల్ రాజు మరోసారి జాక్ పాట్ కొట్టారు. యంగ్ హీరోలతో వరుస హిట్లు దండుకుంటున్న దిల్ రాజు ఇప్పుడు టాలీవుడ్ 'కింగ్'ను కూడా లైన్ లో పెట్టేసినట్టు టాలీవుడ్ వర్గాల తాజా భోగట్టా. నాగచైతన్యను సక్సెస్ ఫుల్ గా 'జోష్' చిత్రం ద్వారా దిల్ రాజు పరిశ్రమకు పరిచయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిన ముచ్చటే. దిల్ రాజు కెపాసిటీ మీద నమ్మకం ఉంచిన నాగార్జున తనకంటూ సొంత బ్యానర్ ఉన్నప్పటికీ దిల్ రాజు బ్యానర్ కే నాగచైతన్యను పరిచయం చేసే బాధ్యతను అప్పగించారు. 'జోష్' సినిమా ఫస్టాఫ్ చూసిన నాగార్జున దిల్ రాజును అభినందనలతో ముంచెత్తారట. ఇదే క్రమంలో దిల్ రాజు తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో ప్రపోజ్ చేశారనీ, అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారనీ తెలుస్తోంది.
కామాక్షి కళా మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో నాగార్జున ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రాధామోహన్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయబోతున్నారు. 'ఆకాశమంత' చిత్రంతో రాధామోహన్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు ఇటీవలే పరిచయమయ్యారు. ఆ చిత్రం తెలుగు వెర్షన్ నిర్మాత దిల్ రాజు కావడం విశేషం. ఇటీవల రాధామోహన్ చెప్పిన ఓ స్టోరీలైన్ నాగార్జునకు నచ్చడంతో ఆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందనీ, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారనీ తెలుస్తోంది. నాగార్జున-కామాక్షి మూవీస్ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నందున అదే నెలలో నాగార్జున-దిల్ రాజు కాంబినేషన్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీనికి 'పయనం' అనే టైటిల్ ప్రచారంలోకి ఉండగా, సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ను అనుకుంటున్నారు.
Be first to comment on this News / Article!
|