500 థియేటర్లలో 'జోష్'
నాగార్జున నటవారసుడు నాగచైతన్య కథానాయకుడుగా పరిచయమవుతున్న 'జోష్' (యూత్ రాక్స్) చిత్రం భారీ అంచనాల మధ్య ఈనెల 3న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. వాసువర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో 300 ప్రింట్లతో 500 థియేటర్లలో దిల్ రాజు విడుదల చేయబోతున్నారు. ఓవర్ సీస్, ఇతర రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు మరో 100 ప్రింట్లు కూడా నిర్మాత సిద్ధం చేస్తున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ, తమ బ్యానర్ నుంచి ఇంతవరకూ వచ్చిన ఎనిమిది చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయనీ, 'జోష్' తో ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయమనీ తెలిపారు. కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా 'జోష్' చిత్రం రూపొందిందనీ, అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఈ చిత్రం అలరిస్తుందనే గట్టి నమ్మకం తనకుందనీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వెలువల, ఓవర్ సీస్ మార్కెట్లతో పాటు ఉత్తరాది కీలక ప్రాంతాలైన ఢిల్లీ, కోల్ కతా, ముంబై, పునే మల్టీప్లెక్స్ లలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా నటిస్తూ తెలుగుతెరకు పరిచయమవుతోంది. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జె.డి.చక్రవర్తి, బ్రహ్మానందం, సితార, ఆనంద్, సూర్య తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం వాసువర్మ అందించిన ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి-చంద్రబోస్ పాటలు, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|