13 ఏళ్లలో 13 సినిమాలు
ఆయన యూత్ స్టైల్ ఐకాన్. సక్సెస్ లకు పొంగిపోవడం, ఫెయిల్యూర్స్ కి కృంగి పోవడం ఆయన నైజం కాదు. తక్కువ మాట్లాడటం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఆయనలోని ప్రత్యేకత. రిజర్వ్ డ్ గా ఉంటారు. ఒక వ్యక్తిగా సమజానికి తానేమి చేయగలననే తపన ద్యోతకమవుతుంటుంది. ఆయనే...అన్నమాట జవదాటని లక్ష్మణుడు..అభిమానులకు మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్.
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన పవన్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 'గోకులంలో సీత', 'సుస్వాగతం', 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' వంటి వరుస హిట్లు పవన్ కెరీర్ కు కీలకమైతే, 'ఖుషీ' చిత్రం సంచనలం విజయం సాధించింది. ఆ చిత్రం చూసిన యూత్ పవన్ ను ఇమిటేడ్ చేయడానికి ఉర్రూతలూగారు. ఆ తర్వాత 'గుడుంబా శంకర్', 'బాలు', 'జానీ' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'జానీ' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం ద్వారా తనలోని సృజనాత్మకతకు, ప్రతిభను చాటుకున్నారు. అన్నాచెల్లెల అనురాగంపై తీసిన 'అన్నవరం' మళ్లీ పవన్ ను సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చింది.ఆ తర్వాత వచ్చిన 'జల్సా' పవన్ స్టామినా చాటుతూ చక్కటి విజయాన్ని సాధించింది. రాశి కంటే వాసి అవసరమని భావించే పవన్ సినిమాల సంఖ్య 13. ఆసక్తికరంగా ఆర్టిస్టుగా కూడా ఆయనకు ఇది 13వ బర్త్ డేనే. ఏడాదికి ఒక సినిమా చొప్పున చేసుకువస్తున్న పవన్ ఇక నుంచి సినిమాల సంఖ్య పెంచే ఆలోచనలో కూడా ఉండటం అభిమానులను 'జోష్'లో ముంచెత్తుతోంది. 'ఖుషీ' వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ప్రస్తుతం 'కొమురం' పులి చిత్రంలో పవన్ నటిస్తున్నారు. 'జల్సా'తో మరోసారి సక్సెస్ ట్రాక్ లో వచ్చిన పవన్ నుంచి ఈ సినిమా వస్తుండటం, అదికూడా 'యువరాజ్యం'తో యువనాయకుడి అవతారం ఎత్తిన తర్వాత వస్తున్న చిత్రం కావడంతో 'కొమురం పులి'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అవినీతి నాయకుల భరతం పట్టే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పవన్ ఇందులో పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. తదుపరి చిత్రంగా నటుడు గణేష్ బాబు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రానికి పవన్ కమిట్ అయ్యారు. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి 149వ చిత్రానికి దర్శకత్వం వహించాలనే పట్టుదలతో కూడా పవన్ ఉన్నారు. రాజకీయాలకే పరిమితమవ్వాలనే 'అన్న'ను ఎలాగైనా ఒప్పించి మళ్లీ కెమెరా ముందుకు తేవాలనే గట్టి పట్టుదలతో ఆయన ఉన్నారు. అదే జరిగితే మెగాభిమానులకు పండుగే. ఏటా నిరాడంబరంగా పుట్టిన రోజు జరుపుకొనే పవన్ ఈరోజుతో మరో వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.
Be first to comment on this News / Article!
|