'మగధీర' సెకెండ్ రిలీజ్!
తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక ప్రింట్లు, థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రామ్ చరణ్ 'మగధీర' చిత్రం కలెక్షన్ల ప్రభజనంతో రికార్డుల దిశగా దూసుకుపోతుంది. హాలీవుడ్ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ చిత్రం మూడు వారాల్లో 55 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ గణాంకాలు చెబుతున్నాయి. 40 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం భారీ లాభాలను తెచ్చిపెడుతుండటంతో మరింత పటిష్టమైన మార్కెట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లేందుకు గీతా ఆర్ట్ సంస్థ చురుకుగా సన్నాహాలు జరుపుతోంది. సినిమా 100 రోజులు పూర్తయిన వెంటనే ఈ స్ట్రాటజీని అమలు చేస్తారు. ఇందులో భాగంగా 'మగధీర' నిడివిని ట్రిమ్ చేసేందుకు తొలగించిన కొన్ని సన్నివేశాలను జోడించి సెకెండ్ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి తొలగించిన సన్నివేశాలకు అయిన ఖర్చు కోటి రూపాయల పైమాటేనని సమాచారం.
సెకెండ్ రిలీజ్ కోసం అదనపు సన్నివేశాలను జోడించి ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శించాలనీ, ఇందువల్ల మళ్లీ రిపీటెడ్ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని గీతా ఆర్ట్స్ నిశ్చితాభిప్రాయంతో ఉంది. ఆ ప్రకారం సుమారు 25 నిమిషాల నిడివిని పెంచుతూ కొత్త ప్రింట్లను తీసుకురాబోతున్నారు. పరమితమైన ప్రింట్లు పరిమిత మైన థియేటర్లలో సెకెండ్ రిలీజ్ ఉండబోతోందని తెలుస్తోంది. తెలుగు సినిమాల విషయంలో సెకెండ్ రిలీజ్ లు దాదాపు కనుమరుగైన తరుణంలో థియేటర్లలో సినిమా ఉండగానే, కొత్త ప్రింట్లతో సెకెండ్ రిలీజ్ చేయాలనే మార్కెట్ వ్యూహం 'మగధీర' చిత్రాన్ని మరిన్ని హైట్స్ కు తీసుకు వెళ్లడం ఖాయమనే అభిప్రాయం పరిశ్రమలో బలంగా వ్యక్తమవుతోంది.
Be first to comment on this News / Article!
|