పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త వారసులు అడుగుపెడుతూ ఉంటారు. హీరోల వారసులు పరిశ్రమలోకి వచ్చినట్టుగా హీరోయిన్ల కూతుళ్లు పరిశ్రమలోకి రావడం అరుదు. చాలాకాలం తర్వాత టీనేజ్ బ్యూటీ కార్తిక సినీ వారసత్వ నేపథ్యంలో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. కార్తిక మరెవరో కాదు. 80వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాధ కుమార్తె. నాగార్జున తనయుడు నాగచైతన్య తొలిసారి హీరోగా పరిచయమవుతున్న 'జోష్' చిత్రంలో ఆ యువహీరోకి జోడిగా కార్తిక నటించింది. వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'జోష్' ఈనెల 3న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కార్తిక ముంబైలోని తన నివాసంలో రిలాక్స్ అవుతూ 'జోష్' ఫలితం కోసం ఉత్సుకతో ఎదురుచూస్తోంది.
'పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిలా నా పరిస్థితి ఉంది. అమ్మ ప్రతిభావంతురాలైన నటిగా పేరుతెచ్చుకుంది. అమ్మ సాధించిన దాంట్లో సగం సాధించినా నేను సక్సెస్ అయినట్టే' అని కార్తిక నవ్వుతూ చెప్పింది. తన టాలీవుడ్ ఎంట్రీ, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ 'నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఆ ఛాన్స్ నన్ను వరించింది. నటిని కాకపోయి ఉంటే చదువు మీద ఎక్కువగా దృష్టి సారించేదాన్ని. స్విట్జర్లాండ్ లో హోటల్ మేనేజిమెంట్ కోర్సు చేయాలని అనుకుంటున్న తరుణంలో సినీరంగంలో అవకాశం వచ్చింది. జోష్ చిత్రంలో నటించడం సరికొత్త అనుభూతినిచ్చింది. నాగచైతన్య గురించి చెప్పాలంటే మంచి ప్రొఫెషనల్. షూటింగ్ సందర్భాల్లో ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం రాలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల కోసం తిరిగి ముంబై వచ్చేశాను. మనలోని ప్రతిభే మాట్లాడుతుందని అమ్మ ఎపుడూ చెబుతుంది. అందుకోసమే నేను కూడా ఎక్కువ ప్రచారాన్ని కోరుకోవడం లేదు. వ్యక్తిగతంగా అన్ని రకాల నృత్యరీతుల్లోనూ మాస్టర్ అనిపించుకోవాలని ఉంది. అలాగే పెయింటింగ్స్ వేయడం ఎంతో ఇష్టం. పబ్ ల చుట్టూ తిరిగేంత వయసు కాదు. ఖాళీ సమయం కుటుంబ సభ్యులకు కేటాయించేందుకే ఇష్టపడతాను. నటిగా ఏదో ఒక భాషా చిత్రానికే కట్టుబడి ఉండాలనుకోవడం లేదు. ఏ భాషలో మంచి ఆఫర్ వచ్చినా చేయడానికి సిద్ధం. ఏమాత్రం ఉపయోగం లేని 20 సినిమాలు చేయడం కంటే ఏడాదికి ఒక మంచి సినిమా చేసినా చాలనుకుంటున్నాను' అని కార్తిక తన మనోగతం వ్యక్తం చేసింది.