నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడుగా వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'జోష' చిత్రం విడుదల వాయిదా పడింది. గురువారం ఈ చిత్రం విడుదల కావలసి ఉండగా ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణం చేస్తున్న హెలికాఫ్టర్ బుధవారంనాడు ప్రమాదంలో చిక్కుకోవడంతో 'జోష్' చిత్రం విడుదలను వాయిదా వేసినట్టు దిల్ రాజు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ ను ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు చెప్పారు. విడుదల తేదీని మళ్లీ ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం రాత్రి హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన 'జోష్' ప్రమీయర్ షోను కూడా రద్దు చేశారు.
అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడుగా నాగచైతన్య పరిచయం అవుతుండటంతో 'జోష్' చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఊహించని విధంగా ముఖ్యమంత్రి ప్రమాదంలో పడి రాష్ట్రవ్యాప్తంగా ఉద్విగ్న పరిస్థితులు నెలకొనడంతో దిల్ రాజు సమయోచితంగా వ్యవహరించి సినిమా విడుదలను వాయిదా వేశారు.