ఎన్టీఆర్ సినిమాకి త్రిష 'నో'
'కంత్రీ' చిత్రం తర్వాత ఎన్టీఆర్ మరోసారి ఆ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో నటించేందుకు సన్నద్ధమవుతున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ఉత్తర భారతదేశం బ్యాక్ డ్రాప్ లో మెహర్ రమేష్ తెరకెక్కించబోతున్నారు. ఇందులో భాగంగానే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, కోల్ కతా ప్రాంతాల్లో భారీ షెడ్యూల్స్ కు ఆయన ప్లాన్ చేస్తున్నారు.
ఆసక్తికరంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా త్రిష నటించనుందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈ ఆఫర్ ను త్రిష సున్నితంగా నిరాకరించిందని టాలీవుడ్ వర్గాల తాజా భోగట్టా.
దక్షిణాది హీరోయిన్లు వరుసగా బాలీవుడ్ కు పయనమవుతున్న నేపథ్యంలో త్రిష కూడా ఇప్పుడు అక్షయ్ కుమార్ కథానాయకుడుగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందనున్న 'కట్టా మీఠా' చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు చకచగా పూర్తి చేసి హిందీ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు త్రిష తహతహలాడుతోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ తో కలిసి నటిస్తున్న 'శంఖం' షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. దీనికితోడు వెంకటేష్ తో 'నమో వెంకటేశ' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే యూరప్ లో ఓ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తనకున్న కమిట్ మెంట్ల కారణంగానే ఎన్టీఆర్ చిత్రాన్ని త్రిష నిరాకరించినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా కమల్ హాసన్ తదుపరి చిత్రంలో త్రిష నటించనున్నట్టు వస్తున్న వార్తలను కూడా ఆమె ఖండించింది. కమల్ తనను సంప్రదించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చిచెప్పింది.
Be first to comment on this News / Article!
|