చిన్న చిత్రాల హీరోగా ఏటా అత్యధిక సినిమాల్లో నటిస్తున్న అల్లరి నరేష్ ఇప్పుడు పెద్ద బ్యానర్ చిత్రాల వైపు మళ్లుతున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం పరిశ్రమపై అంతగా లేనప్పటికీ కొద్ది కాలంగా రియల్ ఎస్టేట్, స్టాఫ్ వేరే రంగాల నుంచి వచ్చిన పలువురు చిన్న చిత్రాల నిర్మాతలు ఇప్పుడు నిర్మాణరంగానికి దూరంగా ఉంటున్నారు. ఇది అల్లరి నరేష్ వంటి హీరోలను ఆలోచింపజేస్తోంది. ఈ క్రమంలో ఆయన పెద్ద బ్యానర్ల నుంచి వస్తున్న ఆఫర్లను తెలివిగా అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'బెండు అప్పారావు ఆర్ఎంపి' చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందుతోంది. డాక్టర్ డి.రామానాయుడు నిర్మాత. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అల్లరి నరేష్ మరో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యానర్ లో తమిళ 'నానోడిగల్' రీమేక్ లో రవితేజతో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్ 18 కోట్ల పైమాటేనని తెలుస్తోంది. తాజాగా అల్లరి సురేష్ ఉషాకిరణ్ ఆఫర్ ను కూడా అందిపుచ్చుకున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ తర్వాత అత్యధిక చిత్రాలను వివిధ భాషల్లో నిర్మించిన క్రెడిట్ ఉషాకిరణ్ మూవీస్ కు దక్కుతుంది. దాదాపు 70 చిత్రాలు ఈ బ్యానర్ లో రూపొందాయి. ఇటీవలే ఈ సంస్థ నుంచి వచ్చిన 'నచ్చావులే' చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంది. ఆ చిత్రం తర్వాత అల్లరి నరేష్ కథానాయకుడుగా ఉషాకిరణ్ సంస్థ నిర్మించనున్న చిత్రానికి 'సుడిగాడు' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. వినోదపరమైన చిత్రాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఏతావాతా ఆర్ధిక మాంద్యం ఏమాత్రం సోకని సుడిగాడుగా కూడా అల్లరి నరేష్ నిరూపించుకుంటున్నారు.