క్విక్ గన్ కాదు...లేట్ గన్!
'పేరులోనే క్విక్...రిలీజ్ లో మాత్వం లేట్' అంటూ ఆంధ్రప్రదేశ్ లో 'క్విక్ గన్ మురుగన్' చిత్రం విడుదలలో జరుగుతున్న జాప్యం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా ఇంగ్లీషు, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందింది. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ పిక్చర్స్ గత నెల 28న విడుదల చేసింది. ఆసక్తికరంగా తెలుగు నటుడైన రాజేంద్రప్రసాద్ నటించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో మినహా దేశవ్యాప్తంగా విడుదలైంది. 'త్వరలో విడుదల' అంటూ పలు పోస్టర్లు నగరంలోని ప్రధాన కూడళ్లలో దర్శనమిస్తున్నప్పటికీ ఈ చిత్రాన్ని హాల్స్ కు తీసుకురావడంలో మల్టీప్లెక్స్ లు సైతం విఫలం కావడం అభిమానులను మరింత ఆవేదనకు గురి చేస్తోంది. 'క్విక్ గన్ మురుగన్' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమకు విడుదలలో జరుగుతున్న జాప్యం నిరాశకు గురిచేస్తోందని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఈ చిత్రంలో విలన్ పేరు 'రైస్ ప్లేట్ రెడ్డి' (నాజర్) కావడం రెడ్డి కులస్థులకు ఆగ్రహం తెప్పించింది. 'రెడ్డి' అనే పదం తొలగించకుంటే సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లను చుట్టుముడతామంటూ హెచ్చరికలు కూడా చేశారు. అయితే సినిమా విడుదలలో జరుగుతున్న జాప్యానికి ఇదెంత మాత్రం కారణం కాదని నిర్మాతలు వివరణ ఇచ్చారు. 'క్విక్ గన్ మురుగన్' విడుదలలో కొద్దిపాటి జాప్యం తలెత్తిన విషయం నిజమేనని ఫాక్స్ స్టార్ ప్రతినిధి విజయ్ సింగ్ తెలిపారు. సెప్టెంబర్ మధ్యలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందనీ, 'క్విక్ గన్ మురుగన్'ను చూడలేక పోతున్నామని అభిమానులు కలత చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదనీ ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు, హిందీ, ఆంగ్ల వెర్షన్లను ఏకకాలంలో విడుదల చేస్తామనీ, ప్రపంచవ్యాప్త రిలీజ్ తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో విడుదల చేయాలని తాము భావించామనీ తెలిపారు. రాజేంద్రప్రసాద్ కు ఆంధ్రప్రదేశ్ లో స్టార్ స్టాటస్ ఉందనీ, సినిమా విడుదల ఆలస్యమైతే అభిమానుల్లో ఉన్న ఆసక్తి తగ్గిపోతుందని తాము అనుకోవడం లేదనీ అన్నారు. ఈ మాటలో కొంత నిజం ఉండే అవకాశాలున్నా..సహనం కోల్పోయిన ఓ వీరాభిమాని మాత్రం 'సినిమా రిలీజ్ వాయిదా వేయడం సమంజసం కాదు. నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని మరీ సినిమా చూడాలని మా ఫ్రెండ్సంతా ఇప్పటికే నిశ్చయించుకున్నాం' అంటూ ఓ కొసమెరుపు ఇచ్చాడు.
Be first to comment on this News / Article!
|