తనీష్ 'మంచివాడు'
తనీష్ ('నచ్చావులే', 'రైడ్' ఫేమ్) కథానాయకుడుగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సుంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మంచివాడు'. పి.లక్ష్మీనారాయణ (దీప్తి) దర్శకుడు. భామ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా పరిచయవుతోంది. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఆ విశేషాలను చిత్రయూనిట్ హైద్రాబాద్ లో తెలియజేసింది.
తనీష్ ఉత్తమ గుణాలు కలిగిన మంచి కుర్రాడిగా ఇందులో నటిస్తున్నాడనీ, అతని సరసన భామ అనే కొత్తమ్మాయిని ఎంపిక చేశామనీ ఆర్.బి.చౌదరి తెలిపారు. తమ బ్యానర్ నుంచి వచ్చిన పలు సకుటుంబ కథా చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా ఉంటుందని చెప్పారు. 'అందాలరాముడు' వంటి హిట్ చిత్రం తర్వాత దర్శకుడు పి.లక్ష్మీనారాయణ మళ్లీ తమ బ్యానర్ లో దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదని తెలిపారు. ఇంటిల్లి పాదీ మెచ్చే మంచి కథతో 'మంచివాడు' చిత్రం తెరకెక్కుతోందని నిర్మాతలు తెలిపారు. ఆగస్టు 31 నుంచి షూటింగ్ ప్రారంభించామనీ, ఈనెల 20 వరకూ తొలి షెడ్యూల్ ఉంటుందనీ వారు చెప్పారు. ఇందులో ఓ కీలక పాత్రను కళాతపస్వి కె.విశ్వనాథ్, మరో కీలక పాత్రను సీనియర్ నటి జయంతి పోషిస్తున్నారనీ, అలాగే సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సైతం మరో కీలక పాత్ర పోషిస్తున్నారనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, వేణుమాధవ్, రఘుబాబు, కోవైసరళ తదితరులు నటిస్తున్నారు. గంగోత్రి విశ్వనాథ్ మాటలు, ఇ.ఎస్.మూర్తి-అభినవ శ్రీనివాస్ పాటలు, వేణుగోపాల్ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, శిల్పి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|