మతపరమైన వివాదంలో స్నేహ
బెంగుళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు తనను వేధిస్తున్నాడంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వ్యవహారం నుంచి కొద్దిగా ఉపశమనం పొందిన నటి స్నేహ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అయితే ఈసారి మతపరమైన వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల తిరువణ్ణామలై ఆలయాన్ని దర్శించిన స్నేహ గిరిప్రదక్షిణ (గిరివాలం)లో కూడా పాల్గొంది. సంప్రదాయబద్ధంగా జరిగే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షణలో స్నేహ పాదరక్షలు వేసుకుని పాల్గొనడం ఇప్పుడు తమిళనాట దుమారం రేపుతోంది. ఆలయ నిబంధనలు, మతపరమైన విశ్వాశాల ప్రకారం భక్తులు పాదరక్షలు లేకుండానే గిరిప్రదక్షణలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా స్నేహ వ్యవహరించడాన్ని హనుమాన్ సేన అనే మత పరిరక్షణ సంస్థ తీవ్రంగా పరిగణించింది. వేలూరులో పలు నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించింది.
దీనిపై స్నేహ స్పందిస్తూ, తన కాలికి గాయమైనందున వైద్యుల సలహా ప్రకారమే గుడ్డతో ప్రత్యేకంగా చేసిన పాదరక్షలనే ధరిస్తున్నాననీ, వాటితోనే తాను 'గిరివాలం' కార్యక్రమంలో పాల్గొన్నాననీ తెలిపింది. ఈ వివరణతో సంతృప్తి చెందని మత పరిరక్షణ సంస్థలు మాత్రం నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ స్నేహపై మండిపడుతున్నాయి.
Be first to comment on this News / Article!
|