'ఏక్ నిరంజన్' టైటిల్ సాంగ్
ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏక్ నిరంజన్' చిత్రం హైద్రాబాద్ లో చివరి షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. ఆదిత్య రామ్ మూవీస్ పతాకంపై ఆదిత్య రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25లో దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో వేసిన స్ట్రీట్ సెట్ లో ప్రస్తుతం సినిమా టైటిల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. 60 మంది డాన్సర్లు, పలువురు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్న ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
చిత్రం ప్రోగ్రస్ ను ఆదిత్యరామ్ తెలియజేస్తూ, ప్రభాస్ బాడీ లాంగ్వెజ్ కు తగ్గట్టు పూరీ మార్క్ చిత్రంగా 'ఏక్ నిరంజన్' తెరకెక్కుతోందని చెప్పారు. ప్రభాస్, పూరీ కెరీర్ లో ఇదో లాండ్ మార్క్ చిత్రమవుతుందని చెప్పారు. ఇటీవల థాయ్ లాండ్ లోని బ్యాంకాక్, పటాయ్ లలో క్లైమాక్స్ సన్నివేశాలు, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామని తలిపారు. సినిమాకి క్లైమాక్స్ ఓ హైలైట్ అవుతుందనీ, యూరప్ ఫైటర్లు కూడా ఇందులో పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుత షెడ్యూల్ సెప్టెంబర్ 15 వరకూ జరుగుతుందన్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి అక్టోబర్ 29న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. సోనూసూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, తనికెళ్ల భరణి, సునీల్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం పూరీ జగన్నాథ్ అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, స్టన్ శివ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|