చరణ్ ఆవిష్కరించిన 'కుర్రోడు'
వరుణ్ సందేష్, నేహాశర్మ జంటగా రూపొందుతున్న చిత్రం 'కుర్రాడు'. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ గుణ్ణం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం జరిగింది. హీరో రామ్ చరణ్ తేజ్ ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి క్యాసెట్ ను పూరీ జగన్నాథ్ కు అందజేశారు. ఆడియోను సీడీని ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించి తొలి ప్రతిని కీరవాణికి అందజేశారు.
ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ, ఆనంది ఆర్ట్స్ అంటే తన సొంత సంస్థ లాంటిందని, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, రామ్ చరణ్ తో తాను తీసిన 'చిరుత' చిత్రానికి తొలుత కుర్రాడు (లోక్లాస్) అనే టైటిల్ ను అనుకున్నామనీ, ఇప్పుడు అదే పేరుతో రాబోతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. సందీప్ గుణ్ణం ఈ చిత్రాన్ని బాగా తీర్చిదిద్ది ఉంటారని అనుకుంటున్నాననీ, ఆయన యుఎస్ లో స్థిరపడకుండా నిర్మాత కిరణ్ ఈ చిత్రం ద్వారా ఇక్కడకు తీసుకురావడం సంతోషదాయకమని రాజమౌళి పేర్కొన్నారు. వరుణ్ సందేష్ ను ఈ చిత్రం ద్వారా మాస్ హీరోగా చూపించబోతున్నారని రామ్ చరణ్ తేజ అన్నారు. సందీప్ తన తండ్రి గుణ్ణం గంగరాజు పేరు నిలబెడతారని ఆశిస్తున్నానని కీరవాణి అన్నారు. ఈ చిత్రం రీరికార్డింగ్ ను తానే చేస్తున్నాననీ, మొదటి భాగం పూర్తయిందనీ, ధైర్యంగా ఈ చిత్రం విజయవంతమవుతుందని చెప్పగలననీ కోటి అన్నారు. సందీప్ గుణ్ణం మాట్లాడుతూ, ఈ చిత్రం పాటలు బాగా వచ్చేందుకు ముగ్గురు కారణమనీ, వారిలో నిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు అచ్చు, గీత రచయిత అనంత శ్రీరామ్ ఉన్నారని అన్నారు. ఇందులోని ఐదు పాటలను అనంత్ శ్రీరామ్ రాసినట్టు చిత్ర సంగీత దర్శకుడు అచ్చు తెలిపారు. నిర్మాతలు రవిశంకర్ ప్రసాద్, కిరణ్, గీత రచయిత అనంత్ శ్రీరామ్, హీరోయిన్ నేహాశర్మ, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి దయానంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|