'నిన్ను కలిశాక' పాటలు
'నచ్చావులే' వంటి హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను కలిశాక'. నూతన నాయకానాయికలను పరిచయం చేస్తూ రామోజీరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్, చైతన్య, ప్రియ, డిపాఫా హీరో హీరోయిన్లు. ఉషాకిరణ్ బ్యానర్ లో వస్తున్న 83వ చిత్రమిది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ కేంద్ర కార్యాలయంలో గురువారంనాడు జరిగింది. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఆడియో సీడీని, క్యాసెట్లను విడుదల చేసి దర్శకుడు శివనాగేశ్వరరావుకు తొలి ప్రతులను అందజేశారు. ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న సంగీత దర్శకుడు సునీల్ కాశ్యప్, హీరోలు సంతోష్, చైతన్యలకు రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఈ చిత్రంలోని ఒక్కో గీతాన్ని ఇద్దరేసి సినీప్రముఖులు వినూత్న రీతిలో ఆవిష్కరించారు. కీరవాణి-చంద్రబోస్, రాజమౌళి-రమారాజమౌళి, తరుణ్-విఎన్ ఆదిత్య, వైవిఎస్ చౌదరి-విష్ణువర్దన్, క్రిష్-మనోజ్, జగపతిబాబు-మదన్ జంట ఈ సాంగ్స్ ను విడుదల చేశారు. 'నిన్ను కలిశాక నెనెలా ఫీలయ్యానో తెలుసా...' అంటూ ఒకరితో ఒకరు తమ మనోభావాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిలిం సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రామ్మోహనరావు, ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, ఈటీవీ నెట్ వర్క్ వైస్ ప్రెసిడెంట్ కె.బాపినీడు, మయూరి ఫిలింస్ జనరల్ మేనేజర్ సుధాకర్, ఈటీవీ ప్రోగ్రామింగ్ హెడ్ అజయ్ శాంతి, ఉషాకిరణ్ మూవీస్ ఇన్ చార్జి రామ్ గోపాల్, రచయిత లక్ష్మీభూపాల్, కెమెరామన్ సంజయ్, ఎడిటర్ గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు.
స్టార్ కాస్ట్...
'నిన్ను కలిశాక' చిత్రంలో హీరోహీరోయిన్లతో పాటు కృష్ణుడు, తరుణ్ మాస్టర్, ఎం.ఎస్.నారాయణ, వినయ్ వర్మ, సందీప్, రవిశంకర్, సునీల్ కపూర్, జోగినాయుడు, సుభాషిణి, సరస్వతి ప్రదీప్, ఇందిర, అనిత, మాస్టర్ శివవర్మ, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి లక్ష్మీభూపాల్ మాటలు, అనంత్ శ్రీరామ్-వనమాలి, లక్ష్మీభూపాల్ పాటలు, బి.ఎల్.సంజయ్ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.
Be first to comment on this News / Article!
|