'ఈనాడు'పై స్టే లేదు: కమల్
'ఈనాడు' (తమిళ ఉన్నైపోల్ ఒరువన్) విడుదలపై పిరమిడ్ సాయిమిరా సంస్థ స్టే తెచ్చుకుందంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజంలేదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ శుక్రవారంనాడు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. యూటీవీతో కలిసి రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మించారు. చక్రి తేలేటి దర్శకత్వం వహించారు. ఈనెల 18న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ పై పిరమిడ్ సాయిమిరా సంస్థ స్టే తెచ్చుకుందనే ఊహాగానాలు గత రెండ్రోజులుగా వినిపిస్తున్నాయి. 'మర్మయోగి' చిత్రంలో నటించేందుకు కమల్ 10.90 కోట్ల రూపాయలు అడ్వాన్ కూడా తీసుకుని ఆ తర్వాత మాట తప్పి సొంత బ్యానర్ చిత్రంలో నటించి సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారనీ, దీనిపై ఆయనకు లీగల్ నోటీసు పంపామని పిరమిడ్ సాయిమిరా సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో అసలు వాస్తవాలు ఏమిటనేవి కమల్ తన తాజా ప్రకటనలో వివరించారు.
'మర్మయోగి' చిత్రం ఏ పరిస్థితుల్లో ఆగిపోయింది, దానికి తానెంత కష్టపడిందీ అందరికీ తెలిసిన విషయమేననీ, ఏడాది పాటు మరే చిత్రంలోనూ తాను నటించలేదనీ కమల్ చెప్పారు. ఈ చిత్రం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశాననీ, సెట్స్ నిర్మాణం చూసుకున్నాననీ, కొంత షూటింగ్ కూడా చేశాననీ ఆయన తెలిపారు. ఇందులో తాను నటించడంతో పాటు, డైరెక్షన్ కూడా చేశానని అన్నారు. తగిన నిధులు లేవంటూ పిరమిడ్ సాయిమిరా సంస్థ చేతులెత్తేయడంతోనే షూటింగ్ కంటిన్యూ చేయలేకపోయామని అన్నారు. ఏడాది పాటు కెరీర్ కోల్పోయినందుకు తన పారితోషికంగా 40 కోట్ల రూపాయల ఇవ్వాల్సిందిగా తాను గత ఏప్రిల్ 12న పిరమిడ్ సాయిమిరా సంస్థకు నోటీసు కూడా పంపినట్టు తెలిపారు. దానికి ఇంతవరకూ ఆ సంస్థ తనకు సమాధానం ఇవ్వలేదన్నారు. పిరమిడ్ సంస్థపై కోర్టులో కేవియట్ కూడా వేశామని చెప్పారు. తనకు కౌంటర్ ఇవ్వడం కోసమే ఇప్పుడు నోటీసులు పంపామంటూ తప్పుడు అభియోగాలతో పిరమిడ్ సంస్థ దుష్ట్ర్రచారానికి పాల్పడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. దీనిపై ఇంటెరిమ్ రిప్లయ్ కూడా పంపామన్నారు. 'పిరమిడ్ సంస్థపై కేవియట్ పొందామనేది అసలైన వాస్తవం. నాకు గానీ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ కు కానీ కోర్టు నుంచి ఎలాంటి స్టే ఆర్టర్ అందలేదు' అని ఆయన స్పష్టం చేశారు. తనకు గానీ, తన కంపెనీ ప్రతిష్ఠకు గానీ భంగం కలిగించే విధంగా ఎవరైనా బాధ్యతారాహిత్యమైన వార్తలు ప్రచురించినా, స్టేట్ మెంట్లు ఇచ్చినా వారిపై చట్ట పరమైన చర్చలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Be first to comment on this News / Article!
|