'బంపర్ ఆఫర్' ఆడియో
సాయిరామ్ శంకర్, బిందు మాధవి హీరోహీరోయిన్లుగా జయరవీంద్ర దర్శకత్వంలో వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ జగ్నాథ్ నిర్మించిన చిత్రం 'బంపర్ ఆఫర్'. ఈ చిత్రం ద్వారా గాయకుడు రఘు కుంచె సంగీత దర్శకుడిగా మారారు. పూరీ జగన్నాథ్ స్థాపించిన పూరీ సంగీత్ ఆడియో కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది. తొలుత ఆడియో కంపెనీ లోగోను రాజమౌళి ఆవిష్కరించారు. అనంతరం హీరో గోపీచంద్ ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని రవితేజకు అందజేశారు. ఆడియో సీడీని డాక్టర్ రాజశేఖర్-జీవిత దంపతులు ఆవిష్కరించి ప్రభాస్ కు అందజేశారు. పూరీ జగన్నాథ్, సాయిరాం శంకర్, బిందుమాధవి, రఘు కుంచె, జెమినీ కిరణ్, రాజు సుందరం, భాస్కరభట్ల, రక్ష, చక్రి, శ్యామ్ కె.నాయుడు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ, ఆడియో మార్కెట్ పడిపోయిన ఈ రోజుల్లో పూరీ జగన్నాథ్ సొంత ఆడియో సంస్థను స్థాపించడం అభినందనీయమనీ, అలాగే రఘు కుంచెను ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారనీ అన్నారు. సాయిరాం శంకర్ '143' చిత్రాన్ని తాను అప్పట్లో చూశాననీ, చాలా బాగా నటించాడనీ, ఆ చిత్రంలోని పాటలు కూడా తనకు ఇష్టమనీ అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ, ఈ చిత్ర కథను తనకు పూరీ చెప్పారనీ, చాలా బాగుందనీ అన్నారు. అలాగే ఈ చిత్రంలో సాయిరాం శంకర్ హెయిర్ స్టైల్ కూడా బాగుందనీ, సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఆడియో కంపెనీ ఏర్పాటు చేసిన పూరీ కి శుభాకాంక్షలనీ, ఈ చిత్రం ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని గోపీచంద్ ఆశించారు. పాటలు చూశాననీ, సాయిరాం శంకర్ చాలా బాగా డాన్స్ చేశాడనీ రవితేజ అన్నారు. టైటిల్ చాలా బాగుందనీ, ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉందనీ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. చక్రి మాట్లాడుతూ, రఘు కుంచె సంగీత దర్శకుడిగా పరిచయవుతుండటం సంతోషంగా ఉందన్నారు. అతను సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. సాయి కొత్తగా కనిపిస్తూనే డాన్స్ లు చాలా బాగా చేశాడనీ, సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ, అమ్మను దేవుడే ఇస్తాడనీ, తనకు అమ్మకు తోడు పూరీ జగన్నాథ్ ను కూడా ఇచ్చాడనీ సంతోషం వ్యక్తం చేశారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, తమ్ముడు సాయి హీరోగా 143 చిత్రానికి మంచి పేరు వచ్చినా డబ్బులు రాలేదనీ అన్నారు. 'బంపర్ ఆఫర్' చిత్రానికి రఘు కుంచె ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారనీ, సినిమా బాక్సాఫీస్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాననీ అన్నారు.
Be first to comment on this News / Article!
|