వైఎస్ పాత్రలో రాజశేఖర్
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన డాక్టర్ రాజశేఖర్-జీవిత దంపతులు ఆయన అకాల మరణం ఇప్పటికీ జీర్ణించుకోలేకున్నారు. తమ ప్రియమత నేత స్మృత్యర్థం ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని జీవిత రాజశేఖర్ దంపతులు ధ్రువీకరించారు. దివంగత నేత జీవిత చరిత్రను సెల్యులాయెడ్ కు ఎక్కించనున్నామనీ, ఆయన సన్నిహితలను కలిసి అందుకు తగిన సమాచారం సేకరించనున్నామనీ జీవిత తెలిపారు.
'వైఎస్ పై చాలాకాలంగా సినిమా తీయాలనే ఆలోచన ఉంది. ఆయన ఆకస్మిక మరణంతో ఇప్పుడు ఆ నిర్ణయం మరింత బలపడింది. వైఎస్ కు సన్నిహితులైన వారిని కలుసుకుని తగిన సమాచారం సేకరిస్తాం. వాస్తవానికి దగ్గరగా ఉండేలా రాజశేఖర్ నడయాడిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుతాం' అని జీవిత చెప్పారు. ఈ చిత్రంలో వై.ఎస్. పాత్రను డాక్టర్ రాజశేఖర్ పోషించనున్నారు. వై.ఎస్. తండ్రి రాజారెడ్డి, వైఎస్, ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డిని కలుపుతూ మూడు జనరేషన్ల కథాంశంగా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ చిత్రం కమర్షియల్ విలువలతో ఉంటుందనీ, వై.ఎస్.నిజజీవితంలో ఎదురైన ఒడిదుడుకులను చూపిస్తూ సందర్భోచితంగా సాంగ్, డాన్స్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయనీ, ఆర్టిస్టిక్ టచ్ తప్పనిసరిగా ఉంటుందనీ జీవిత తెలిపారు. వైఎస్ బాల్యం నుంచి ఎంబిబిఎస్ చేయడం, రాజకీయాల్లోకి రావడం వంటి అంశాలన్నీ 2 గంటల 30 నిమిషాల నిడివిలో చూపించబోతున్నామని అన్నారు. అయితే ఏయే అంశాలపై ఫోకస్ చేయాలనేది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. ఉత్యున్నత రాజకీయ నాయకుల జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన చిత్రాలు, మణిరత్నం 'ఇరువర్' చిత్రాల లైన్స్ లో ఈ చిత్రం ఉంటుందని ఆమె తెలిపారు. స్క్రిప్టు ఇంకా ఫైనలైజ్ కానప్పటికీ వైఎస్ నిజజీవితానికి అతి దగ్గరగా ఉంటుందని అన్నారు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుందనీ, తనచుట్టూ ఉన్నవాళ్లను చూస్తూ వైఎస్ ఎలా ఎదిగారనేది కథాంశంలో కీలకమనీ చెప్పారు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
|