చరణ్-భాస్కర్ ల 'ఆరంజ్'
'చిరుత'తో చిచ్చరపిడుగు అనిపించుకుని 'మగధీర' చిత్రంతో బాక్సాఫీస్ కలెక్షన్లను షేక్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తన మూడో చిత్రానికి సన్నద్ధమవుతున్నారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్కంగా నిర్మించనున్నారు. 'బొమ్మరిల్లు', 'పరుగు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి 'ఆరంజ్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తాజా సమాచారం.
తొలి రెండు చిత్రాలకు భిన్నంగా రామ్ చరణ్ గెటప్ ఇందులో ఉండబోతోందనీ, అమ్మాయిల మానసచోరుడుగా ఆయన పాత్ర ఉంటుందనీ తెలుస్తోంది. ఈ పాత్ర కోసం స్కై డైవింగ్ లో కూడా రామ్ చరణ్ శిక్షణ తీసుకుంటున్నారు. ఆయనకు జోడిగా జెనీలియా ఎంపికైంది. సెకెండ్ హీరోయిన్ గా కృతి ('బోణి' ఫేమ్) పేరు పరిశీలనలో ఉంది. మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఇందులో ఉండబోతున్నారని తెలుస్తోంది. అమెరికా బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరపనున్నారు. అమెరికాలో ఉన్న ఔత్సాహిక ఎన్ఆర్ఐ నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ చిత్రానికి హారిస్ జైరాస్ సంగీతం అందించనున్నారు. అక్టోబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. అన్నట్టు...పవన్ కల్యాణ్ త్వరలోనే ఏర్పాటు చేయనున్న సొంత బ్యానర్ చిత్రం రామ్ చరణ్ కు నాలుగో సినిమా అవుతుందని మరో ముచ్చట.
Be first to comment on this News / Article!
|