క్యూట్ స్టోరీ 'మౌనరాగం'
ఫ్యామిలీ డ్రామాతో కూడిన అందమైన కుటుంబ కథా చిత్రంగా 'మౌనరాగం' చిత్రం తెరకెక్కుతోందని ఆ చిత్ర నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ తెలిపారు. శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా విజయ్ బాలాజీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తనీష్ ('నచ్చావులే' ఫేమ్) కథానాయకుడు. ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ఈనెల 15 నుంచి తుది షెడ్యూల్ లోకి అడుగుపెడుతోంది.
ఈనెల 15 నుంచి పాటల చిత్రీకరణకు ప్లాన్ చేశామనీ, అక్టోబర్ 15వరకూ జరిగే షెడ్యూల్ తో చిత్ర నిర్మాణం పూర్తవుతుందనీ నాగ అశోక్ కుమార్ తెలిపారు. హైద్రాబాద్, శ్రీశైలం, ఆ పరిసర ప్రాంతాల్లో పాటల చిత్రీకరణకు ప్లాన్ చేశామని చెప్పారు. ఇంతవరకూ గండిపేట హౌస్, ఫిలింనగర్ లోని నవకాంత్ హౌస్, రామానాయుడు స్టూడియో, మణికొండ శివాలయం, కూకట్ పల్లిలోని పలు ప్రాంతాలు, మాదాల రవి హౌస్, గచ్చీబౌలిలోని అమరావతి రెస్టారెంట్, సానా యాదిరెడ్డి థియేటర్, ఆలీ హౌస్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని చెప్పారు. రామానాయుడు స్టూడియోస్ లో ప్రభుత్వం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. తనిష్ సరసన మధురిమ, సుహాసిని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రసాద్ బాబు, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, ఆలీ, ఏవీయస్, రమాప్రభ, హేమ తదితరులు నటిస్తున్నారు. చింతపల్లిరమణ మాటలు, షమిన్ మిత్రు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|