'మగధీర'కు ఎక్స్ ట్రా సీన్లు
తెలుగు సినిమా చరిత్రలోనే 1200 ప్రింట్లతో విడుదలై సరికొత్త రికార్డు సృష్టించిన రామ్ చరణ్ 'మగధీర' చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లను షేక్ చేసింది. రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం తొలి 4 వారాల్లోనే 52 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి పలు ఏరియాల్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఈనెల 18వ తేదీతో ఈ చిత్రం అర్ధ శతదినోత్సవాన్ని కూడా పూర్తి చేసుకోనుంది. ఇదే రోజు నుంచి ఈ చిత్రానికి కొన్ని అదనపు సన్నివేశాలను కూడా జోడించి ప్రదర్శించనున్నట్టు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు.
చిత్ర నిడివిని దృష్టిలో పెట్టుకుని ఎడిటింగ్ సందర్భంగా తొలగించిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు జతచేయబోతున్నారు. రామ్ చరణ్, కాజల్, శ్రీహరి, రావు రమేష్ లపై చిత్రీకరించిన సన్నివేశాలను ఇప్పుడు జోడించనున్నారు. ప్రస్తుతం చిత్రం నిడివి 2.45 నిమిషాలు కాగా, ఇప్పుడు మరికొంత నిడివి పెరుగుతుంది. ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లలోనూ ఈ అదనపు సన్నివేశాలను జోడిస్తున్నారు. తద్వారా 'మగధీర' రీపీటెడ్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తుందనీ, 100 రోజుల వరకూ చిత్రం అప్రహతిహతంగా దూసుకుపోతుందనీ నిర్మాత భావిస్తున్నారు. అదనపు సీన్ల జోడింపుతో 'మగధీర' మరిన్ని రికార్డులను కూడా సొంతం చేసుకునే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|