500 థియేటర్లలో 'జగన్మోహిని'
పాతికేళ్ల క్రితం జయమాలిని టైటిల్ పాత్రలో బి.విఠలాచార్య దర్శకత్వం వహించిన 'జగన్మోహిని' చిత్రం సంచలన విజయం సాధించింది. తాజాగా సరికొత్త టెక్నాలజీ, గ్రాఫిక్స్ ఉపయోగించి నమిత కథానాయికగా 'జగన్మోహిని' చిత్రాన్ని హెచ్.మురళి పునర్నిర్మించారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎన్.కె.విశ్వనాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజా, మీరాచోప్రా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఈనెల 25న తెలుగు, తమిళ భాషల్లో సుమారు 500 థియేటర్లలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
నిర్మాత మురళి ఆ విశేషాలను తెలియజేస్తూ, ఓల్డ్ క్లాసిక్ 'జగన్మోహిని'కి ధీటుగా అద్భుతమైన సాంకేతిక విలువలు, గ్రాఫిక్ వర్క్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు విశ్వనాథన్ తెరకెక్కించారనీ, గ్రాఫిక్స్ కు ఎక్కువ సమయం పట్టడం వల్లనే చిత్ర నిర్మాణం చాలా సమయం పట్టిందనీ అన్నారు. ముఖ్యంగా మూడు ఐలాండ్స్ లో సెట్స్ వేసి సినిమా తీశామనీ, ఇందులోని అండర్ వాటర్ వర్క్ హైలైట్ గా నిలుస్తుందనీ చెప్పారు. ప్రారంభ సన్నివేశాలే ప్రేక్షకులను పూర్తిగా సినిమాలోకి ఇన్ వాల్వ్ చేసేలా ఉంటాయన్నారు. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికే ఆడియో పరంగా చక్కటి ఆదరణ చూరగొంటోందని తెలిపారు. ఈ సినిమా అనుకోగానే గ్లామర్, టాలెంట్ పుష్కలంగా ఉన్న నమితనే ఎంపిక చేయాలని డిసైట్ అయ్యామనీ, జగన్మోహిని పాత్రకు నమిత చక్కటి న్యాయం చేసిందనీ చెప్పారు. అలాగే తెలుగులో మంచి పేరున్న రాజాను తమిళ పరిశ్రమకు ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామని చెప్పారు. రాజ్ హ్యాండ్ సమ్ రాజకుమారుడుగా, మీరాచోప్రా రాజకుమారిగా నటించిందన్నారు. రెండు భాషల్లోనూ అత్యధిక ప్రింట్లతో సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నరసింహరాజు, వడివేలు, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|