మీనా మళ్లీ మేకప్...
బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మీనా. 'సీతారామయ్యగారి మనవరాలు' చిత్రంతో ఆమె తొలిసారిగా హీరోయిన్ అయింది. చివరిసారిగా 'వెంగమాంబ' చిత్రంతో ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మీనా పెళ్లి కుదరి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను పెళ్లాడింది. దీంతో ఇక మీనా నటించే అవకాశాలు అంతగా లేవనీ, నటనకు స్వస్తి చెప్పినట్టేననీ ఊహాగానాలు వినిపించాయి. అనూహ్యంగా ఇప్పుడు మీనా తమిళంలో ఓ కొత్త చిత్రానికి అగ్రిమెంట్ చేయడం ద్వారా నటన తన జీన్స్ లోనే ఉందనీ, రిటైర్ మెంట్ ప్రసక్తి లేదనీ తేల్చిచెప్పింది.
వివాహం తర్వాత 'విడాదే పిడి' (వదలొద్దు పట్టుకో) అనే తమిళ చిత్రానికి మీనా అంగీకరించింది. ప్రభు కథానాయకుడు. ఈ చిత్రానికి టి.పి.గజేంద్రన్ దర్శకుడు. ఈ విషయాన్ని మీనా ధ్రువీకరిస్తూ 'సినిమాలంటే నాకెంత ఇష్టమో అందరికీ తెలుసు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మంచి పొజిషన్ కు చేరుకున్న వాళ్లలో నేనూ ఉన్నాను. జీవితాంతం నటించాలని ఉంది. నా కోరికను మా శ్రీవారు కూడా కాదనలేదు. మంచి స్టోరీ, చక్కటి పాత్ర లభించడంతో విడాదే పిడి చిత్రాన్ని ఒప్పుకున్నాను. మంచి అవకాశాలు వస్తే తెలుగు, మలయాళ తదితర భాషల్లోనూ నటిస్తాను' అంటూ చెప్పుకొచ్చింది. సో..మీనా మరోసారి ముఖానికి మేకప్ వేసుకుని తన అభిమానులను అలరించబోతున్నట్టే.
Be first to comment on this News / Article!
|