నో పాలిటిక్స్: నారా రోహిత్
రాజకీయాలను కెరీర్ గా ఎంచుకోవాలనే ఆలోచన తనకు ఎప్పుడూ కలగలేదని యువ హీరో నారా రోహిత్ తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు సోదరుడైన నారా రామ్మూర్తి తనయుడే నారా రోహిత్. 'బాణం' చిత్రం ద్వారా ఈనెల 16న నారా రోహిత్ హీరోగా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ కుమార్తె చలసాని ప్రియాంక నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా చెతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
తన సినీ అరంగేట్రం గురించి రోహిత్ చెబుతూ, బయోటెక్నాలజీ గ్రాడ్యుయేషన్ చేసిన తాను మాస్టర్ డిగ్రీ చేయాలని అనుకున్నప్పటికీ కెరీర్ సినీరంగం వైపు మళ్లిందని అన్నారు. చెన్నైలో ఉండగానే రెండు సినిమా ఆఫర్లు వచ్చాయనీ, అయితే నటనను కెరీర్ గా మలుచుకోవాలని ఆలోచన వచ్చిన తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఆరు నెలల క్రాష్ కోర్స్ చేశాననీ చెప్పుకొచ్చారు. 'బాణం' స్క్రిప్టు అద్భుతంగా ఉండటం, స్టార్-సెంట్రిక్ మూవీ కావడంతో తన తొలిచిత్రంగా దీనిని ఒప్పుకున్నట్టు చెప్పారు. ఇంతవరకూ ప్రేక్షకులు చూడని ఓ ఫవర్ ఫుల్ రోల్ ఇందులో తాను పోషించాననీ, స్క్రిప్టులో భాగంగానే కొంత రొమాంటిక్ టచ్ కూడా ఉంటుందనీ అన్నారు. అయితే యాక్షన్ ప్రధానంగానే ఈ చిత్రం ఉంటుందని అన్నారు. తన తదుపరి చిత్రాల విషయంలోనూ స్క్రిప్టుకే తన తొలి ప్రాధాన్యం ఉంటుందనీ, రెండు మూడు చిత్రాలు పరిశీలనలో ఉన్నాయనీ నారా రోహిత్ వెల్లడించారు.
Be first to comment on this News / Article!
|