'రాజశేఖర్ రెడ్డి'గా రాజశేఖర్
స్వర్గీయ వై.ఎస్.శేఖర్ రెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. వై.ఎస్.పాత్రలో హీరో డాక్టర్ రాజశేఖర్ నటించనున్నారు. వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దీనికి 'రాజశేఖర్ రెడ్డి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. హైద్రాబాద్ లోని వైష్ణో అకాడమీ సంస్థ కార్యాలయంలో సోమవారంనాడు ఆ విశేషాలను డాక్టర్ రాజశేఖర్ వెల్లడించారు.
ప్రజా నాయకుడుగా, లోకనాయకుడుగా డాక్టర్ వై.ఎస్.శేఖర్ రెడ్డి ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన అందరి హృదయాల్లోనూ చిరస్థాయిగా ఉంటారని రాజశేఖర్ పేర్కొన్నారు. వై.ఎస్. ఆకస్మిక మరణం అందరి హృదాయలను కలిచివేస్తోందన్నారు. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయాలని నిశ్చయించుకుని పూరీ జగన్నాథ్ ను సంప్రదించామనీ, ఆయన తన సంసిద్ధతతను తెలియజేశారనీ పేర్కొన్నారు. శనివారం ఉదయం తాము వై.ఎస్.తనయుడు జగన్ ను కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పామనీ, ఆయన ఎంతో సంతోషించి సినిమాను చక్కటి విషయ సేకరణతో చాలా జాగ్రత్తగా తీయమని సూచనలు చేశారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి నిజజీవిత విశేషాలను సేకరించి, వీటిపై తగినంత అధ్యయనం చేసి సినిమా తీస్తామని అన్నారు. ఇందుకు కొంత సమయం పడుతుందనీ, పూర్తి స్క్రిప్టు రెడీ చేసిన తర్వాత సెట్స్ కు వస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పూరీ జగన్నాథ్, జీవితా రాజశేఖర్ పాల్గొన్నారు
Read 7 Comment(s) posted so far on this News / Article!
|