'బెండు అప్పారావు' పాటలు
అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ జంటగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో డి.రామానాయుడు నిర్మించిన చిత్రం 'బెండు అప్పారావు' (ఆర్ఎంపి). ఇవివి సత్యనారాయణ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం రాత్రి జరిగింది. వెంకటేష్ ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని అభిరామ్ కు అందజేశారు. ఆడియో సీడీని డి.రామానాయుడు ఆవిష్కరించి చిత్ర సంగీత దర్శకుడు కోటికి అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
వెంకటేష్ మాట్లాడుతూ, ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. కామెడీ చిత్రాలు తీయడంలో ఇవివి సిద్ధహస్తుడనీ, నరేష్ తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి చక్కటి కామెడీ చేసి ఉంటాననే నమ్మకం తనకుందనీ అన్నారు. ఇవివి సత్యనారాయణ ఎంతో శ్రద్ధగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, సినిమాలో నాలుగు పాటలు ఉంటాయనీ డి.రామానాయుడు చెప్పారు. నిర్మాతగా తాను, దర్శకుడుగా ఇవివి ఓ మంచి సినిమా చేసినట్టు చెప్పగలనని అన్నారు. ఇవివి సత్యనారాయణ మాట్లాడుతూ, తనకూ, తన తనయులకూ బ్రేక్ ఇచ్చింది రామానాయుగారేననీ, ఆయన బ్యానర్ అంటే తన సొంత బ్యానర్ కిందే లెక్కనీ అన్నారు. ఈ చిత్రంలోని పాత్రలు నిజజీవితానికి దగ్గరగా ఉంటాయనీ, పల్లెటూరిలో తారసపడే పాత్రలు ఇందులో కనిపిస్తాయనీ అన్నారు. ఈ సినిమాలోని పాటలకు కోటి అద్భుతమైన సంగీతం అందించారని అన్నారు. ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా, అమ్ స్టర్ డామ్ లలో ఈ పాటలు చిత్రీకరించామనీ చెప్పారు. తప్పనిసరిగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. ఎల్.బి.శ్రీరామ్, ఆహుతి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ, రామజోగయ్య శాస్త్రి, పావని, రమ్య చౌదరి, అరుణ, పద్మారెడ్డి, గౌతంరాజు, జయరామ్, దయానంద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|