వినాయకరావు 'వెండివెన్నెల'
సీనియర్ సినీ పాత్రికేయుడు యు.వినాయకరావు రచించిన 'వెండివెన్నెల' సినీ పుస్తకావిష్కరణ హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మంగళవారంనాడు జరిగింది. 1931లో టాకీ పుట్టుక నుంచి నేటి వరకూ ఒకే టైటిల్ తో వచ్చిన (మళ్లీ మళ్లీ తీసిన) సుమారు 70 చిత్రాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని వినాయకరావు రాశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజుకు అందదేశారు. మలి ప్రతిని 'ఆంధ్రజ్యోతి' సిఎండి వేమూరి గోపాలకృష్ణ కొనుగోలు చేశారు.
డాక్టర్ దాసరి నారాయణరావు మాట్లాడుతూ, పాతిక్రేయుడుగా రజతోత్సవ తరుణంలో వినాయకరావు ఈ పుస్తకాన్ని రాయడం ఎంతో సంతోషంగా ఉందనీ, ఒక థీసిస్ లా ఇంత మంచి పుస్తకాన్ని రాసిన వినాయరావు అభినందనీయుడనీ అన్నారు. వినాయకరావు ఎంతో సౌమ్యుడైన పాత్రికేయుడనీ, ఆయన తనకు పాతికేళ్లుగా తెలుసుననీ డివిఎస్ రాజు పేర్కొన్నారు. టాకీ ప్రారంభమైన రోజున ఈ పుస్తకం విడుదల కావడం ముదావహమని అన్నారు. 'అలం అరా', 'భక్త ప్రహ్లాద', 'కాళిదాసు' వంటి తొలి టాకీ చిత్రాల్లో తన తండ్రి ప్రమేయం ఉందనీ, అలనాటి చిత్రాల గురించి వినాయకరావు రాసిన 'వెండివెన్నెల' అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనీ రమేష్ ప్రసాద్ పేర్కొన్నారు. వినాయకరావు మాట్లాడుతూ, ఇది తన జీవితంలో మరుపురాని రోజని అన్నారు. రెండేళ్ల పాటు కష్టపడి ఈ పుస్తకాన్ని తీసుకు చ్చాననీ, తెలుగు టాకీ పుట్టిన రోజున ఈ పుస్తకాన్ని విడుదల చేయాలనే తన కోరక నెరవేరిందనీ అన్నారు. పుస్తక రచనలో తనకు సహకరించిన వారికీ, పుస్తకంగా రూపొందేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎన్.ఆర్.ఐ. జయరామ్ కోమటికి తన కృతజ్ఞతలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సారిపల్లి కొండలరావు, తమ్మారెడ్డి భరద్వాజ, కె.సి.శేఖర్ బాబు, కె.అచ్చిరెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, ఏవీయస్, చావా సుధారాణి, ప్రసన్నకుమార్, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభు తదితరులు పాల్గొన్నారు. గుండు సుదర్శన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Be first to comment on this News / Article!
|