'నీ మనసు నాది' ఆడియో
ఆర్థిక మాంద్యం ప్రభావంతో విలవిలలాడుతున్న యువత నిరుత్సాహపడకుండా సొంతంగా ఎదగాలంటూ ఓ యువకుడు మార్గ నిర్దేశనం చేసే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమే 'నీ మనసు నాది'. గాయత్రి భరద్వాజ్ సమర్పణలో శ్రీ భద్రకాళి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ అడ్లూరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శ్రీకాంత్ అడ్లూరి, స్నేహిత హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లో జరిగింది. ఫాయక్ ఫర్వేజ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో సీడీని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ విడుదల చేశారు. ఫిలిం చాంబర్ సంయుక్త కార్యదర్శి జి.వి.మోహన్ గౌడ్, పాలక మండలి సభ్యుడు సి.ఎన్.రావ్, సాయిగణేష్ తదితరులు పాల్గొన్నారు.
విదేశాల మోజులో పడి జీవితాలను నరకం చేసుకుంటున్న యువతకు దేశభక్తిని ప్రభోదిస్తూ, తమ కాళ్లపై నిలబడి జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని శ్రీకాంత్ అడ్లూరి తెలిపారు. ఇందులో ఐదు పాటలు ఉన్నాయనీ, ఆడియోపరంగానూ, చిత్రీకరణ పరంగానూ బాగా వచ్చాయనీ చెప్పారు. ఈ నెలాఖరులోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఆడియోతో పాటు సినిమా విజయవంతం కావాలని అతిథులు అభిలషించారు.
Be first to comment on this News / Article!
|