సెట్స్ నుండి శ్వేతాబసు వాకౌట్
'ఎ..క్కా..డా..' అంటూ పదాలను సాగదీస్తూ 'కొత్తబంగారులోకం' చిత్రంతో యువత గుండెలకు గేలం వేసిన శ్వేతా బసు ప్రసాద్ ఈమధ్యనే గ్లామర్ డోస్ పెంచి 'రైడ్' కూడా చేసింది. ఈ రెండు చిత్రాలతో పాటు 'కాస్కో' అనే చిత్రంలోనూ, ఉదయ్ కిరణ్ తో ఓ ప్రేమకథా చిత్రంలోనూ శ్వేత ప్రస్తుతం బిజీగా ఉంది. అదనంగా సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డి.శ్రీనివాసరావు ('ద్రోణ' ఫేమ్), ఎ.చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్న పేరు పెట్టని ఓ చిత్రంలో 'యువత' ఫేమ్ నిఖిల్ కు జోడిగా నటిస్తోంది. తమిళ యువకుడు సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణా స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతుంది. ఈ చిత్రంకోసం ఓ రొమాంటిక్ సాంగ్ ను మంగళవారంనాడు చిత్రీకరిస్తుండగా మరీ అంత సెక్సీగా, రొమాంటిక్ గా నటించడం నావల్ల కాదంటూ శ్వేతాబసు సెట్స్ నుంచి వాకౌట్ చేసినట్టు యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.
ఇటీవల కాలంలో రీమిక్స్ సాంగ్స్ కు పెరిగిన క్రేజ్ దృష్ట్యా 'ఆ బుగ్గమీద గోరు గిచ్చుడేందబ్బా...' అనే రీమిక్స్ ను దర్శకుడు ప్లాన్ చేశారు. ఒకప్పుడు కృష్ణ-శ్రీదేవి జంటపై కె.రాఘువేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'వజ్రాయిధం' చిత్రంలోని హిట్ సాంగ్ ఇది. రామచిలకలు, ద్రాక్షపళ్లు, వాయిద్యాలతో అత్యంత రొమాంటిక్ గా ఈ పాటను అప్పట్లో కెఆర్ఆర్ చిత్రీకరించారు. ఇదే పాట రీమిక్స్ ను మరింత మషాలాలతో తీయాలని దర్శకుడు సురేష్ అనుకున్నప్పుడు పాటకు అనుగుణంగా రొమాంటిక్ హావభావాలు పలికించేందుకు శ్వేత నిరాకరించిందట. వల్గారిటీ ఎక్కువగా ఉందంటూ పేచీ పెట్టిందట. కళాత్మకంగానే చిత్రీకరణ ఉంటుందని ఫిల్మ్ మేకర్ నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ శ్వేత వాగ్యుద్ధానికి దిగి సెట్స్ నుంచి విసవిసా వెళ్లిపోయిందని సమాచారం. దీంతో పాట చిత్రీకరణకు బ్రేక్ పడింది.
Be first to comment on this News / Article!
|