'విలేజ్ లో వినాయకుడు'సాంగ్స్
కృష్ణుడు హీరోగా మూన్ వాటర్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై సాయికిరణ్ అడవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'విలేజ్ లో వినాయకుడు'. మహి దర్శకుడు. ఆ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం కూకట్ పల్లిలోని కళామందిర్ షోరూంలో మంగళవారం సాయంత్రం జరిగింది. సాయికిరణ్ అడవి, కృష్ణుడు, యండమూరి వీరేంద్రనాథ్, వనమాలి, మహి, మణికాంత్ కాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీని సాయికిరణ్ ఆవిష్కరించగా, కళామందిర్ అధినేత కల్యాణ్ 1000 రూపాలయకు తొలి సీడీని కొనుగోలు చేశారు. మధుర ఆడియోస్ ద్వారా మార్కెట్ లో విడుదలైన సీడీ ధరను కేవలం 9.98 రూపాయలుగా నిర్ణయించారు.
ఇది రెగ్యులర్ సినిమా కాదనీ, విలక్షణమైన ఇతివృత్తంతో రూపొందిన చిత్రమనీ యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. తన స్వస్థలమైన రాజోలు సమీపంలో షూటింగ్ జరిగిందనీ, ఇందులో తాను ఓ పాత్రను కూడా పోషించాననీ ఆయన చెప్పారు. తొలిచిత్రం వినాయకుడుతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయికిరణ్ తన రెండో సినిమాకి కూడా మంచి ప్రతిభాపాటవాలు చూపారని అన్నారు. ఇందులోని పాటలన్నీ వీనులవిందుగా ఉంటాయన్నారు. సాయికరణ్ తన తొలి చిత్రం ద్వారా తనను హీరోను చేశారనీ, అందులో ప్రేమించడానికి ఆహార్యం ప్రధానం కాదనీ, మంచి మనసు ఉండాలనే విధంగా తన పాత్ర ఉంటుందనీ, ఈ చిత్రంలో థీమ్ కూడా అలాంటిదే అయినా కొత్త తరహాలో ఉంటుందని చెప్పారు. పాటలన్నింటికీ మంచి మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నం చేశాననీ, సాహిత్య గుభాళింపులు ఉంటాయనీ సంగీత దర్శకుడు మణికాంత్ కాద్రి తెలిపారు. కేవలం 39 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసినట్టు సాయికిరణ్ తెలిపారు. ఈ సినిమాకి రియల్ స్టార్ యండమూరి వీరేంద్రనాథ్ అనీ, ఇందులో నటించేందుకు ఒప్పుకున్న ఆయనకు తన కృతజ్ఞతలనీ అన్నారు. ఆడియో పైరసీని అరికట్టేందుకే సీడీ ధరను తగ్గించినట్టు చెప్పారు. గ్రామగామానికి పాటలు చేరువ కావాలన్నదే తమ అభిమతమని అన్నారు. మరో రెండు వారాల్లో సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత మహి తెలిపారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|