'మగధీర' 50 రోజుల రికార్డు
రామ్ చరణ్ 'మగధీర' చిత్రం తెలుగు సినిమా రికార్డులను తరగరాస్తూ 301 స్ట్రయిట్ థియేటర్లలో అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకోనుంది. దక్షిణాది సినీ చరిత్రలో ఇది సరికొత్త రికార్డుగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. జూలై 30న విడుదలైన ఈ చిత్రం ఈనెల 18వ తేదీతో 50 రోజులు పూర్తి చేసుకోనుంది.
రామ్ చరణ్, కాజల్ జంటగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ సెంటర్ల పరంగా, బడ్జెట్ పరంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని 1200 ప్రింట్లతో 1500 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఇప్పటికే 60 కోట్లకు పైగా షేర్ ను రాబట్టినట్టు కలక్షన్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అల్లు అరవింద్ ఈనెల 18 నుంచి మరికొన్ని అదనపు సన్నివేశాలను సినిమాకి జోడించబోతున్నారు. నిడివి పరంగా ఎడిటింగ్ అయిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు జోడిస్తున్నారు. 'మగధీర' ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలోనూ ఈ అదనపు సన్నివేశాలను తగిలించనున్నారు. ఇదే ఊపులో తమిళంలో ఈ చిత్రాన్ని కొంత రీషూట్ తో అనువదించి విడుదల చేయాలనీ, హిందీలో హృతిక్ రోషన్ కథానాయకుడుగా రీమేక్ చేయాలనీ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్రను తమిళంలో ప్రభుతో తీస్తారనీ , హిందీలో సల్మాన్ ఖాన్ ను అనుకుంటున్నారనీ సమాచారం. హిందీ వెర్షన్ కు రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|