'సమర్ధుడు'కు పరీక్ష
సక్సెస్ విలువ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాతే తెలుస్తుందంటారు. హ్యాండ్ సమ్ హీరో రాజా ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. ఒక్క హిట్ వస్తే మళ్లీ కెరీర్ పట్టాలమీదకు వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. 'ఆనంద్', 'వెన్నెల' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో బిజీ హీరో అయిన రాజా ఇటీవల కాలంలో వరుస ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నారు. 'మిస్టర్ మేథావి', 'మాయాబజార్' 'నీ సుఖమే నే కోరుతున్నా', 'అందమైన అబద్ధం' వంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ ను నిరాశపరచాయి. ప్రస్తుతం ఆయన చేతిలో 'సమర్ధుడు', 'జగన్మోహిని', 'ఇంకోసారి' వంటి చిత్రాలు ఉన్నప్పటికీ ఒక హిట్ మాత్రం అనివార్యమవుతోంది. ఇందులో భాగాంగా రాజా 'సమర్ధుడు' చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరోసారి రాజాను సక్సెస్ ఊరిస్తోంది.
రాజా ఇందులో క్రిమినల్ గా తొలిసారి పూర్తి మాస్ క్యారెక్టర్ ను పోషించగా, మరో కీలకమైన రాజకీయనాయకుడు జె.కె. పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించారు. రాజాతో పాటు చిత్ర కథనాయిక సంజనకు కూడా ఓ హిట్ అనివార్యమవుతోంది. 'బుజ్జిగాడు' చిత్రంతో పరిశ్రమలోకి వచ్చిన సంజన అనుకున్న రీతిలో ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె కూడా 'సమర్ధుడు' పైనే ఆశలు పెట్టుకుంది. రాజా, కృష్ణంరాజు సైతం ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ లో భాగంగా ప్రెస్ మీట్లతో మీడియాను ఆకట్టుకుంటున్నారు. మరి 'సమర్ధుడు' ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాడనేది ఈ శుక్రవారమే తేలుతుంది.
Be first to comment on this News / Article!
|