'క్విక్ గన్' లేటుపై ఆర్పీ విచారం
రంగురంగుల దుస్తులు, కౌబాయ్ హ్యాట్, చేతిలో గన్ తో 'క్విక్ గన్ మురుగన్'గా హాలీవుడ్ లో తళుక్కుమని మెరసిన మన ఆంధ్ర ఛార్లీ చాప్లిన్ రాజేంద్రప్రసాద్ తెలుగువారికి మాత్రం ముఖం చేటేశారు. ఆంధ్రప్రదేశ్ మినహా దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి అరుదైన ప్రశంసలే దక్కుతున్నాయి. రాజేంద్రప్రసాద్ ను హాస్య నటకిరీటితో గౌరవించుకున్న తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ జాప్యాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఆలస్యంగా విడుదల చేయాలనే ఫిల్మ్ మేకర్స్ ఆలోచన రాజేంద్రప్రసాద్ ను కూడా మనస్థాపానికి గురిచేసింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. 'రెడ్డి' పేరుపై తలెత్తిన వివాదం సినిమా జాప్యానికి కారణం కాదన్నారు.
'దేశవ్యాప్తంగా సినిమా రిలీజైన రోజునే ఆంధ్రప్రదేశ్ లో కూడా విడుదలై ఉండాల్సింది. నేను తెలుగు హీరోని కావడంతో తెలుగు, ఇంగ్లీషు వెర్షన్ ఒకేసారి రిలీజ్ చేద్దామని ఫాక్స్ స్టార్ డిస్ట్రిబ్యూటర్లు పట్టుబట్టారు. వాళ్లకు ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కార్పొరేట్ సంస్థలు వారి స్టయిల్ లోనే ఆలోచిస్తారు. తెలుగులో డబ్బింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది' అని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. విలన్ పేరు చివర్లో 'రెడ్డి' కావడంతో తలెత్తిన వివాదం సినిమా జాప్యానికి కారణం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో నాజర్ పోషించిన విలన్ పాత్ర పేరు రైస్ ప్లేట్ రెడ్డి అనీ, అయితే ఇది ఉద్దేశపూర్వకంగానో, రెడ్డి కులస్థులను ఇబ్బంది పెట్టేందుకే ఉద్దేశించినది కాదని ఆయన అన్నారు. గతంలో తాను 'అప్పుల అప్పారావు', 'పేకాట పాపారావు' అనే
పేర్లతో సినిమాలు చేశాననీ, అయితే అలాంటి పేర్లున్న వాళ్లంతా అప్పులపాలైన వాళ్లేనని అనుకుంటే సరికాదని అన్నారు. సినిమానే తన ఊపిరనీ, 32 ఏళ్లగా ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాననీ చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి సీరియస్ సబ్జెక్టులకే పరిమితమవుతున్న రాజేంద్రప్రసాద్ ఇప్పుడు 'క్విక్ గన్ మురుగన్'తో మళ్లీ తన ట్రేడ్ మార్క్ నవ్వులు పంచడంతో మళ్లీ నిర్మాతలు ఆ తరహా పాత్రల కోసం ఆయనను ఎప్రోచ్ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో నాలుగు చిత్రాలకు ఆయన కమిట్ అయ్యారు. వీటిలో 'బ్రహ్మలోకం టు యమలోకం' చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది.
Be first to comment on this News / Article!
|