చియాన్ విక్రమ్ తో స్వాతి!
నటించిన ఐదు చిత్రాలతో మూడు హిట్లు, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి (అష్టాచమ్మా) అవార్డును అందుకున్న క్రెడిట్ కలర్స్ స్వాతికి దక్కుతుంది. మాటల్లో వేగం, హావభావాల్లో చిలిపిదనం స్వాతిని యువ ప్రేక్షకులకు దగ్గర చేసింది. కృష్ణవంశీ 'డేంజర్' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన స్వాతి ఆ తర్వాత 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' చిత్రంతో నటిగా మంచిపేరు తెచ్చుకుంది. ఇదే సమయంలో తమిళంలో నటించిన 'సుబ్రమణియపురం' తమిళంలో ఆమెకు తొలి సక్సెస్ అందించింది. గత ఏడాది తెలుగులో నటించిన 'అష్టాచమ్మ' చిత్రంలో మహేష్ అభిమానిగా ఆమె చేసిన అభినయం అవార్డులకు అర్హం చేసింది. స్వాతి హీరోయిన్ గా నటించిన 'కలవరమాయె మదిలో' చిత్రం కూడా ఇటీవలే రిలీజైంది. ఆ చిత్రం తర్వాత మరో కొత్త చిత్రం అంగీకరించని స్వాతికి ఇప్పుడు ఊహించని అవకాశం తలుపుతట్టింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తదుపరి చిత్రంలో స్వాతి హీరోయిన్ గా ఎంపికైనట్టు తాజా సమాచారం.
రెండేళ్లకు పైగా నిర్మాణం జరుపుకొని ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మల్లన్న' చిత్రం తెలుగులో బాక్సాఫీస్ పరంగా నిరాశపరచినా, తమిళంలో 'కందస్వామి'గా విడుదలై కమర్షియల్ సక్సెస్ చవిచూసింది. ఎక్కువ సమయం ఒకే సినిమాకి కేటాయించడం వల్ల గ్యాప్ పెరుగుతోందని భావించిన విక్రమ్ ఇప్పుడు ఏకకాలంలో రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేశారు. వీటిలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో '24' అనే చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. ఇందులో విక్రమ్ కు జోడిగా గ్లామర్ నటి ఇలియానా నటించనుంది. దీనికితోడు సెల్వరాఘవన్ ('ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే' ఫేమ్) దర్శకత్వంలో మరో చిత్రానికి కూడా విక్రమ్ కమిట్ అయ్యారు. ఇందులో హీరోయిన్ పాత్ర కలర్స్ స్వాతిని వరించిందనీ, విక్రమ్ వంటి స్టార్ హీరో తో అవకాశం అనగానే స్వాతి సంబరంలో మునిగిపోయిందనీ ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|