విలక్షణ నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇది. పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తయిన ఈ తరుణాన్ని దక్షిణాది సినీ పరిశ్రమ పలు రీతిల్లో జరుపుకొంటూ కమల్ పట్ల తమకున్న గౌరవాభిమానాలకు చాటుకుంటోంది. కమల్ సైతం తన గోల్డెన్ జూబ్లీ ఇయర్ కానుకగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై 'ఈనాడు' (తమిళంలో 'ఉన్నైపోల్ ఒరువన్') చిత్రాన్ని రెడీ చేశారు. హిందీ 'ఎ వెన్స్ డే' చిత్రానికి రీమేక్ గా చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కమల్ తో పాటు వెంకటేష్, తమిళంలో మోహన్ లాల్ నటించారు. ఈనెల 18న రెండు భాషల్లోనూ భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదలవుతుందటం కమల్ అభిమానులను సంబరంలో ముంచెత్తుతోంది. ఆసక్తికరంగా అమెరికాలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నర్మదా మీడియా డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేక తరహాలో ఈ చిత్రం రిలీజ్ ను జరుపుకోనున్నారు.
సినిమా ప్రదర్శనతో పాటు కమల్ పై ప్రత్యేకంగా రూపొందించిన ఒక వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించబోతున్నారు. ఆరేళ్ల ప్రాయంలో 'కలత్తూర్ కణ్ణన్' చిత్రంతో బాలనటుడిగా కమల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఐదు దశాబ్దాల కెరీర్ విశేషాలతో ఈ వీడియోను రూపొందించారు. 'ఉన్నైపోల్ ఒరువన్' కాంటెస్ట్ లో విజేతలైన 50 మందికి కమల్ హాసన్ ఆటోగ్రాఫ్ తో కూడిన ఆడియో ఆల్బమ్ ను కూడా అందజేయనున్నారు. కమల్ నటనాభినయానికి ఇది నిస్సందేహంగా ఓ గోల్డెన్ ట్రీట్...