'ఏక్ నిరంజన్' అక్టోబర్ 29న
ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'ఏక్ నిరంజన్'. ఆదిత్య రామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యరామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరీ జగన్నాథ్ సమర్పకుడు. ఈనెల 17వ తేదీతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు ఆదిత్యారామ్ తెలిపారు.
ప్రభాస్ బాడీలాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ అద్భుతంగా తెరకెక్కించారనీ, ప్రభాస్, పూరీ జగన్నాథ్ కెరీర్ లో ఇది మరో బ్లాక్ బస్టర్ అవుతుందనీ ఆయన చెప్పారు. తొలిసారి తెలుగు తెరకు పరిచయమవుతున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుందన్నారు. బ్రహ్మానందం, ఆలీ పై తీసిన కామెడీ ట్రాక్ మరో హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు. థాయ్ లాండ్ లో 20 రోజుల పాటు తీసిన క్లైమాక్స్ లో మన ఇండియన్ ఫైటర్లతో పాటు యూరప్ ఫైటర్లు కూడా పాల్గొన్నారనీ, అత్యధిక వ్యయప్రయాసతో చిత్రీకరించిన క్లైమాక్స్ ఇదనీ చెప్పారు. ఈనెలలోనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేసి అక్టోబర్ 29న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూసూద్, ముకుల్ దేవ్, మకరన్ దేశ్ పాండే, సునీల్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, పోసాని, సంగీత తదితరులు తారాగణం. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం పూరీ జగన్నాథ్ అందించిన ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, చిన్నా కళాదర్శకత్వం, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, స్టన్ శివ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|