మహేష్ 'కలేజా'
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన కొత్త చిత్రం ఏదీ గత ఏడాది విడుదల కాలేదు. అయితే ఇక నుంచి ఏడాదికి రెండు చిత్రాలు తప్పనిసరిగా ఉంటాయని మహేష్ కమిట్ కావడంతో ఆయన ఆ దిశగా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. 'అతడు' వంటి సంచనల విజయం తర్వాత మహేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. కనకరత్న మూవీస్ బ్యానర్ పై సింగనమల రమేష్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలుత ఈ చిత్రానికి 'వరుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ టైటిల్ తమ పరిశీలనలోనే లేదని మహేష్ మొదట్నించీ చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం 'వరుడు' టైటిల్ అల్లు అర్జున్- గుణశేఖర్ కాంబినేషన్ చిత్రానికి ఖరారైంది. తాజాగా మహేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రానికి 'కలేజా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.
యాక్షన్ తో కూడిన ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, తొలుత అనుకున్న కథకు కొన్ని మార్పులు చేయడంతో 'కలేజ' అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుందని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారనీ తెలుస్తోంది. ఈ చిత్రంలో టాక్సీ డ్రైవర్ గా నటిస్తుండగా, అతనికి జోడిగా అనుష్క నటిస్తోంది. ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సునీల్, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ నవ్వుల విందు చేయబోతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ పాపులర్ కెమెరామన్ సునీల్ పటేల్ ('హమ్ తుమ్' ఫేమ్) సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 2010 సంక్రాంతి కానుకగా 'కలేజా' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్ర తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన సోదరి మంజుల నిర్మించనున్న చిత్రానికి మహేష్ కమిట్ అయ్యారనీ, శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమాకి కూడా ప్లానింగ్ జరుగుతోందనీ తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|